Minister Ponguleti Meeting with Tehsildars : సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన 33 జిల్లాల తహసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లలాగ పని చేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ శాఖలలో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనదని అంతే కాకుండా అన్ని సందర్భాలలో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని మంత్రి అన్నారు. రాష్ట్రం మొత్తంలో సుమారు 972 మంది తహసీల్దార్లు ఉన్నారని, గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ఉండే సమస్యలను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ముఖాముఖ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి అన్నారు.
అంతే కాకుండా రెవెన్యూ చట్టాల సవరణలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలకు మీరు ఇచ్చేసలహాలు, సూచనలను కూడా అవసరమైన మేరకు పరిగణలోనకి తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే నిరంతరం ఆలోచిస్తుందని, ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉండేలా మీరు ప్రజలకు సేవలందరిచాలని మంత్రి తెలిపారు. ధరణిలోని సమస్యలతో ప్రజలు, రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని, అందుకే ముఖ్యమంత్రి ఆర్ఓఆర్ చట్టాల రూపకల్పనను చేసారని మంత్రి అన్నారు.
ఇక్కడ ఉన్నవారందరు ఎక్కువ శాతం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారై ఉంటారని రైతుల సమస్యలు మీకందరికి తెలుసన్నారు. రెవెన్యూ శాఖలలో ఎంత నిజాయితీగా పనిచేసిన కూడా నిందలు తప్పవని అంతరాత్మను సాక్షిగా పెట్టుకొని పనులు చేయాలన్నారు. కార్యాలయాలలో సిబ్బంది కొరత, మౌళిక వసతులు, ఫర్నీచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయిన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల వరకు చేరవేయడంలో, ప్రభుత్వ భూములను రక్షించడంలో మీరు ముఖ్య భూమిక వహిస్తున్నారని అభినందించారు. అందుకనుగుణంగా మీ సమస్యలను తీర్చేలా చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. మీరు తప్పు చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందో లేదో గాని ప్రభుత్వానికి మాత్రం చెడ్డపేరు వస్తుందని మంత్రి అన్నారు.
"రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం. తహశీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తాం. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లలా పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. ప్రభుత్వంలోని అన్ని శాఖలకంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనది."-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి