AP TET Results Released 2024 : ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు 3,68,661 మంది హాజరయ్యారు. అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించారు. ఫలితాల కోసం https://cse.ap.gov.in/ క్లిక్ చేయండి.
Telangana TET Notification 2024 : మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ నేడు జారీ కానుంది. పాఠశాల విద్యాశాఖ అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో నేడు నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జనవరిలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. గత మే నెలలో నిర్వహించిన పరీక్షలను సుమారు 2.35 లక్షల మంది రాశారు. వారిలో 1.09 లక్షల మంది పాసయ్యారు.
ఈసారి డీఎస్‌సీ కూడా పూర్తయినందున పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గవచ్చని భావిస్తున్నారు. ఆన్‌లైన్ పరీక్షలైనందున కనీసం వారం పది రోజుల పాటు స్లాట్లు దొరకాల్సి ఉంటుంది. అందువల్ల సంక్రాంతి లోపా? ఆ తర్వాతా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. టెట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా జనవరిలో పదోసారి జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్ష - TET Conducted TWICE IN A YEAR