Rat in Chutney Viral Video : సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉదయం అల్పాహారం కోసం చేసిన చట్నీలో ఎలుక కనిపించడం కలకలం రేపింది. బాలుర హాస్టల్ క్యాంటీన్‌లోని చట్నీ పాత్రకు మూత పెట్టకపోవడంతో ఓ మూషికం అందులో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కొందరు ప్రజా ప్రతినిధులకు ఆ వీడియోను పంపించారు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. చట్నీ పాత్రలో ఎలుక పడలేదని ఆయన స్పష్టం చేశారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో మాత్రమే ఎలుక కనిపించిందని పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆయన ఆరోపించారు.
విచారణ చేపట్టి నివేదిక ఇవ్వండి : ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీవో, ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్న మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల హాస్టళ్లు, క్యాంటీన్‌లలో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లలో తరచూ తనిఖీలు చేయాలన్నారు.
కాంట్రాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం : మంత్రి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి క్యాంపస్‌కు వెళ్లారు. అక్కడ వంట గదిని పరిశీలించగా, అపరిశుభ్రంగా ఉండటంతో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త వారిని చేర్చుకోవాలని ఆదేశించారు. అంతకు ముందు విద్యార్థులను అడిగి వివరాలు తీసుకున్నారు. ప్రతిరోజు ఆహారంలో ఏదో ఒకటి వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించాలని అదనపు కలెక్టర్ సిబ్బందికి సూచించారు.