Intensity of Cold has Increased in Telangana : రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో చలి ప్రభావం పెరిగింది. తెల్లవారుజామున రోడ్లపై ఏమీ కనిపించలేనంతగా మంచు కమ్మేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వివరించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా చలి తీవ్రత ఉందని రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని తెలిపారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉష్టోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి.
ఆదిలాబాద్‌లో 12.7 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయి. రాబోయే రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముంది. రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, మెదక్, పటాన్‌చెరు ప్రాంతాల్లో సాధారణ కంటే ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది - ధర్మరాజు, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి
తెలంగాణను వణికిస్తున్న చలి పులి - ఇది ట్రైలర్ మాత్రమే - అసలు సినిమా ముందుంది!
ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల నవంబరు నుంచి చలి తీవ్రత ఎక్కువుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈ కారణంగానే ఈ నెల నుంచి మంచు కురుస్తున్నట్లు ఆయన వివరించారు. తూర్పు, ఈశాన్య ఈదురు గాలుల ప్రభావం కూడా రాష్ట్రంపై అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ గాలిలో తేమ అధిక శాతం ఉంటున్న కారణంగా అవి ఉత్తర తెలంగాణలోకి ప్రవేశించగానే పొగ మంచు పడటం మొదలవుతుందని వివరించారు. ఈ పవనాలు దక్షిణ భారతం నుంచి మధ్య, ఉత్తర భారతం వైపుగా సాగుతాయని చెప్పారు.
పిల్లలు వృద్ధులు జాగ్రత్త వహించాలి : శీతాకాలంలో చలి తీవ్రత ఉదయం 4.30గంటల నుంచి ఎక్కువగా ఉంటుందన్న ఆయన దట్టమైన పొగ మంచు కురుస్తూ ఉంటుందని తెలిపారు. సూర్యరశ్మి పెరుగుతున్న సమయంలో మంచు పోతుందన్నారు. శీతాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు వేడి పానీయాలు తీసుకోవాలని సూచించారు. ముదురు రంగు దుస్తులు ధరించాలన్నారు.
పగబడుతోన్న పొగ మంచు - అప్రమత్తంగా లేకపోతే గాల్లోకి ప్రాణాలు!