Medigadda Barrage Repairs Not Start : మరో రెండు వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పటికీ తాత్కాలిక మరమ్మతుల విషయంలో ముందడుగు పడలేదు. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పనులు ప్రారంభించాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చేసిన సిపార్సుల విషయమై ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ లేఖ రాశారు. అందుకు ఏ పనికి ఎంత ధర అన్నది నిర్ధరించి, అనుబంధ ఒప్పందం చేసుకోవాలని నిర్మాణ సంస్థ కోరుతోంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే విషయంపై చర్చ జరిగినట్లు తెలిసింది.
అయితే ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు ఎల్ అండ్ టీకి కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్(రామగుండం) సుధాకర్ రెడ్డి లేఖ రాశారు. మొదట పనులు చేయాలని, చట్ట ప్రకారం అదనంగా చెల్లించాల్సి వస్తే ప్రభుత్వం ఇస్తుందని, ఒప్పందం మేరకు ఏజెన్సీనే భరించాలని న్యాయ విచారణ కమిషన్, దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తే అప్పుడు మీరే భరించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ అధికారికంగా స్పందించలేదని సమాచారం.
వర్షాకాలం మొదలవగానే గోదావరిలో ప్రత్యేకించి ప్రాణహితకు వరద పోటెత్తుతుంది. అప్పుడు బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా నీటిని పూర్తిగా వదిలేయడానికి అవసరమైన చర్యలతో పాటు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సూచించింది. వర్షాకాలంలో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచాలి. అలాగే ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న రెండు గేట్లను పూర్తిగా తొలగించాలని తెలిపారు. మరో ఆరు గేట్లను పైకి ఎత్తడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే సరి చేయాలన్నారు.
సీసీ బ్లాకులు, రాఫ్ట్, సీకెంట్ పైల్స్‌తో సహా జియో ఫిజికల్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలని కమిటీ నివేదికలో సూచించింది. దాన్ని ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనిల్ జైన్ ఈ నెల ఒకటో తేదీన నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపారు. సమయం తక్కువగా ఉండటం, ఎన్నికల కోడ్ కారణంగా అధికారులే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నీటిపారుదల శాఖ కార్యాచరణ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. నాలుగు రోజుల క్రితం ఎన్డీఎస్ఏ నివేదికను ఎల్ అండ్ టీకి పంపి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
పాత బిల్లులను ఇప్పించాలని వినతి : బ్యారేజీ మరమ్మతుల విషయమై పీటముడి కొనసాగుతుండగానే పాత బిల్లులు రూ.300 కోట్లను ఇప్పించాలని ఎల్అండ్టీ కోరింది. అయితే అందుకు ఇంజినీర్లు మొదట పని ప్రారంభిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దెబ్బతిన్న గేట్లను తొలగించడానికి, మిగిలిన ఆరు గేట్ల మరమ్మతులకు, ఇంకా ఏవైనా పనులు మిగిలి ఉంటే వాటన్నింటిని పూర్తి చేయడానికి అయ్యే మొత్తాన్ని కూడా చెల్లించాలని ఎల్అండ్టీ కోరినట్లు సమాచారం. దీనిపై స్పష్టత వస్తేనే అది ముందుకెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎల్అండ్టీ మాత్రం ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసిన పనుల్లో కొన్ని చేయడానికి రెండు నెలలు సమయం పడుతుందని, మరికొన్నింటికి నెల రోజులు అవసరమని నీటిపారుదల శాఖ ఈఎన్సీ వద్ద జరిగిన సమావేశంలో పేర్కొంది. జియో ఫిజికల్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు చేయడానికి పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలిసింది. ప్రాణహిత నుంచి వరద వచ్చేలోగా ఎన్డీఎస్ఏ మధ్యంతర సిఫార్సులను అమలు చేయలేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నెల క్రితమే పనులు పూర్తి చేయాలని సీఏ లేఖ : ఒప్పందం ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ పనులను నిర్మాణ సంస్థే చేపట్టాల్సి ఉందని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఏప్రిల్ 15న నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. గతంలో పని పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాన్ని పొరపాటున ఇచ్చినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు బ్యారేజీని యథాస్థితికి తేవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదేనని అన్నారు. తన సొంత నిధులతో చట్టప్రకారం చర్యలు తీసుకొని, జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలన్నారు. ఇలా చీఫ్ ఇంజినీర్ తన 11 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇది రాసి నెల రోజులైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.