Skin Problems with Adulterated Saffron : సింధూరం సౌభాగ్యానికి చిహ్నం. ఈ క్రమంలో పెళ్లైన మహిళలు కుంకుమ వాడడం సాధారణమే! కొందరు దీన్ని నుదుటన పెట్టుకుంటే, మరికొంతమంది పాపిట్లో దిద్దుకుంటారు. అయితే ఈ రోజుల్లో కుంకుమ వాడే కొంతమందిలో పలు రకాల చర్మ సమస్యలు తలెత్తడం చూస్తున్నాం. ఇందుకు వీటి తయారీలో వాడే హానికారక కెమికల్స్ కారణమంటున్నారు నిపుణులు. అందుకే కొనే ముందే కుంకుమ క్వాలిటీని పరిశీలించడం తప్పనిసరి అంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి ఈ స్టోరీలో..
ప్రస్తుత కాలంలో మార్కెట్లో కల్తీ కాని వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. సహజసిద్ధంగా పండే పంటలు మొదలుకొని తినే ఆహార పదార్థాల్నీ కల్తీ చేసేస్తున్నారు కొందరు. అంతేకాదు.. ఈ కల్తీ వల్ల బ్యూటీ ప్రొడక్ట్స్ తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. వీటిలో సింధూరం కూడా ఒకటి.
ఎలాంటి సమస్యలొస్తాయ్?
సహజంగా తయారుచేసిన కుంకుమ ముదురు ఎరుపు కలర్లో ఉంటుంది.. లేదంటే కాస్త ఆరెంజ్ షేడ్‌లో లభిస్తుంది. అయితే కొంతమంది వీటికి ఆర్టిఫిషియల్ కలర్స్, మెరిసేలా చేయడానికి లెడ్-మెర్క్యురీ వంటి రసాయనాలు కలుపుతున్నారు. ఇలాంటి కల్తీ కుంకుమ వాడడం వల్ల చాలామందిలో స్కిన్ సంబంధిత అలర్జీలు, ర్యాషెస్, దురద, ఆ ప్రదేశంలో చర్మం ఎరుపెక్కడం.. వంటి పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో ఆ చర్మ భాగం బ్లాక్‌గానూ మారుతుంటుంది. అయితే ఇలాంటి రసాయన పూరిత కుంకుమను వాడటం వల్ల చర్మానికే కాదు.. ఆరోగ్యానికీ హానికరమే అంటున్నారు నిపుణులు. ఇలాంటి కుంకుమను దీర్ఘకాలం పాటు వాడితే.. వీటి తయారీలో వాడిన హానికారక లోహాలు.. బ్రీతింగ్కు సంబంధించిన పలు సమస్యలకు దారితీయడంతో పాటు నాడీ, మూత్రపిండాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థల పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయట! ఫలితంగా ఆయా అవయవాలకు సంబంధిత సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
ఇలా గుర్తించచ్చు!
అటు హెల్త్‌పరంగా, ఇటు బ్యూటీ పరంగా ఆయా సమస్యలు రాకుండా నివారించుకోవాలంటే.. కొనే ముందే కుంకుమలోని కల్తీని కనిపెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించడం మేలు చేస్తాయంటున్నారు.
- ✷ కుంకుమ నేచురల్ కలర్ కాకుండా గులాబీ, కాషాయం, మరీ ముదురుగా.. ఇలా విభిన్న రంగుల్లో దొరుకుతుంది. ఇలాంటి కుంకుమ కృత్రిమ రంగులు వాడి తయారుచేసిందే అని గుర్తించాలంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి కలర్స్‌లో ఉన్న కుంకుమ కొనకపోవడమే మంచిదంటున్నారు.
- ✷ సహజసిద్ధంగా సిద్ధంచేసిన కుంకుమ రంగు చేతికి అంటుకోదు.. అదే అంటుకుందని గుర్తిస్తే మాత్రం.. అందులో కృత్రిమ రంగులు, హానికారక డైలు యాడ్ చేసినట్లుగా పరిగణించాలి.
- ✷ కొన్ని కుంకుమలు చూడ్డానికి సాధారణ పౌడర్లా కాకుండా.. ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తాయి. హానికారక డైలు, కెమికల్స్ కలపడం వల్లే వీటికి ఈ గ్లాసీ లుక్ వస్తుందట! అందుకే వీటినీ సైడ్ చేయాలని అంటున్నారు. అలాగే సాధారణ కుంకుమకే మెరుపులు కలిపిన సింధూరం కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది. అదీ వద్దంటున్నారు నిపుణులు.
- ✷ సహజసిద్ధంగా తయారుచేసిన కుంకుమ ఘాటైన వాసనను కలిగి ఉండదట! ఒక రకమైన ఆహ్లాదకరమైన స్మెల్‌ను కలిగి ఉంటుంది. అలా కాకుండా రసాయనాలు కలిపినట్లుగా గాఢమైన స్మెల్ వచ్చినా, ఒక రకమైన లోహపు వాసన వచ్చినా.. దీన్ని కల్తీ కుంకుమగా పరిగణించచ్చంటున్నారు నిపుణులు.
- ✷ నీటి పరీక్ష ద్వారా కూడా కల్తీ కుంకుమను గుర్తించవచ్చట! ఈ క్రమంలో ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కుంకుమ వేసి మిక్సింగ్ చేయాలి. అసలు కుంకుమ అయితే అది నీటిలో కంప్లీట్‌గా కరిగిపోతుంది. అదే నకిలీదైతే.. నీళ్లు ఆయా రంగుల్లోకి మారి.. పదార్థపు అవశేషాలు దిగువకు చేరతాయంటున్నారు నిపుణులు.
- ✷ మనం కొనే చాలా వస్తువులపై లేబుల్‌ని పరిశీలిస్తాం.. కానీ కుంకుమ ప్యాకెట్/బాక్స్‌పై ఉన్న లేబుల్‌ని పరిశీలించే వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. కానీ అటువంటి నిర్లక్ష్యం తగదంటున్నారు నిపుణులు. ఈ ప్రొడక్ట్ తయారీలో ఏమేం వాడారో చెక్ చేసుకున్నాకే కొనమంటున్నారు. అలాగే సరైన సర్టిఫికేషన్ ఉన్న బ్రాండెడ్ కుంకుమను కొనడం, ఆ లేబుల్‌నీ పూర్తిగా పరిశీలించడం మంచిది.
కొరియన్ మహిళల బ్యూటీ సీక్రెట్ ఇదే - అందానికి ఆ అలవాట్లే అతి ముఖ్యం - Korean Beauty Skin Secrets
నిద్ర గురించి ఈ అపోహలు మీలోనూ ఉన్నాయా? - నిపుణులు చెబుతున్నదేమిటంటే..?