Manchu Vishnu about Family Dispute : ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని, తమ ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ వివాదం తమ మనసులను ఎంతో బాధపెడుతోందని పేర్కొన్నారు. గత రెండ్రోజులుగా మంచు కుటంబంలో జరుగుతున్న వివాదంపై తాజాగా స్పందించిన మంచు విష్ణు, తమను విపరీతంగా ప్రేమించడమే తన నాన్న చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. ఇవాళ మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
మీడియా ప్రతినిధికి గాయాలు కావడం దురదృష్టకరమని మంచు విష్ణు పేర్కొన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని, తన నాన్న మోహన్‌బాబు నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారని గుర్తుచేశారు. తన నాన్న మొహంమీద మైకు పెట్టడంతో క్షణికావేశంలో కొట్టారని వివరించారు. గాయపడిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో మాట్లాడానని తెలిపారు. నిన్నటి ఘటన అలా జరిగి ఉండకూడదని పేర్కొన్నారు. నిన్నటి ఘర్షణలో తన నాన్నకు కూడా కొన్ని గాయాలయ్యాయని తెలిపారు. తాను లేని నాలుగైదు రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయని విష్ణు చెప్పారు.
'నేను ఇంట్లో ఉండి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. ఆస్తులన్నీ నాన్న స్వార్జితం వాటిపై హక్కు ఆయనదే. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం.కొందరికి చిన్న కుటుంబం అంటే ఇష్టం. నా ఇంట్లో ఉండొద్దని నాన్న అంటే ఆ మాటకు గౌరవమివ్వాలి' - మంచు విష్ణు
నోటీసులు రాకముందే మీడియాకు లీక్ : కన్నప్ప పోస్టు ప్రొడక్షన్ పని మీద లాస్‌ఏంజెల్స్‌లో ఉండగా ఫోన్ వచ్చిందని, దీంతో వెంటనే అమెరికా నుంచి వచ్చేశానని మంచు విష్ణు చెప్పారు. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. పోలీసుల నోటీసులు తమకు రాకముందే మీడియాకు లీక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గన్ సరెండర్ చేయాలని నిన్ననే ఆదేశించినట్లు మీడియాలో వచ్చిందని గుర్తుచేశారు. గన్ సరెండర్‌పై ఇవాళ ఉదయం 10.30 గం.కు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఉదయం 9.30 గం.కు నోటీసు ఇచ్చి, 10.30కు విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.
నేను మాత్రం అలా మాట్లాడలేను : కమిషనర్‌పై ఉన్న గౌరవంతో విచారణకు వెళ్తానని మంచు విష్ణు తెలిపారు. ఏ ప్రాతిపదికన తనకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఘటన జరిగినప్పుడు దేశంలోనే లేనని మరి నోటీసు ఎలా ఇస్తారని అన్నారు. సీపీని కలవాల్సిన అవసరం తనకు లేదని అయినా కలుస్తానని చెప్పారు. కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని, కుటుంబ వివాదం గురించి ఏమీ మాట్లాడనని చెప్పారు. చిన్నవాడు అవగాహన లేకుండా మాట్లాడి ఉండొచ్చు అని పేర్కొన్నారు. తాను మాత్రం అలా మాట్లాడలేనని స్పష్టం చేశారు.
'మా నాన్నను అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు - ఆయన దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు'
మీడియా ప్రతినిధులపై దాడి - సీనియర్ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు