Man Meets His Family After 12 years : తాను చెడు అలవాట్లకు బానిసయ్యానని తెలిస్తే తండ్రి కొడతారేమోననే భయంతో ఓ బాలుడు 12 క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. ఏకంగా సొంత రాష్ట్రాన్నే దాటి హైదరాబాద్ నగరానికి చేరుకుని కొంతమంది నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో చేతులు కలిపాడు. ఈ క్రమంలోనే నగరంలో పలు నేరాలకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు అతడి కోసం తీవ్రంగా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాన్‌బెయిలబుల్ కేసులో నిందితుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేయగా మిస్సింగ్ కేసు బయటకొచ్చింది.
ఇదీ జరిగింది : జార్ఖండ్‌కు చెందిన అర్మాన్ అలం సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి సికింద్రాబాద్‌కు చేరుకున్నాడు. అర్మాన్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించారు. రాంచీలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాను సిగరెట్ తాగడాన్ని తండ్రి స్నేహితుడు చూశారని ఇంట్లో చెబుతాడేమోననే భయంతోనే పారిపోయి వచ్చినట్లు అర్మాన్ చెప్పాడు.
భావోద్వేగానికి గురైన అర్మాన్ తల్లి : కుమారుడు ఇక దొరకడనుకుని అతడి జ్ఞాపకాల్లో ఇన్నాళ్లు గడిపేస్తూ వచ్చిన అర్మాన్ తల్లిదండ్రులకు ఇన్నాళ్లకు విముక్తి కలిగింది. నాన్‌బెయిబుల్ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ పోలీసులు చూపిన చొరవతో 12 ఏళ్లుగా అనుభవించిన దు:ఖానికి ముగింపు లభించింది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన అర్మాన్ తల్లి తన కుమారుడిని సరైన దారిలో పెట్టుకుంటామని తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత కుమారుడి చూసిన అర్మాన్ తల్లి సుందేరా భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తాము అనుభవించిన శోకం ఎవరూ పడొద్దని కుమారుడిని ఇక చక్కని దారిలో నడిపిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.
అర్మాన్ కోసం చాలా రోజులు వెతికాం. పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశాం. చాలా రోజులు ప్రయత్నించినా దొరకలేదు. ఇక మేం ఆశలు వదిలేసుకున్నాం. ఇప్పుడు పోలీసుల చొరవతో మా బాబు మాకు దొరికాడు - సుందేరా, అర్మాన్ తల్లి
అర్మాన్ మాదిరే చాలా మంది ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి పొట్టకూటి కోసం దొంగలుగా మారుతున్నారని అలాంటి వారిలో మార్పు తేవడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాల్ చెప్పారు.
12 ఏళ్ల బాలుడికి ఓ రౌడీ షీటర్ బెయిల్ ఇప్పించిన విషయమే మాకు ఆధారంగా మారింది. దీనిపై మేం అర్మాన్ ప్రశ్నిస్తే తాను రాంచీ నుంచి పారిపోయి వచ్చానని చెప్పాడు. దీంతో అతని తల్లిదండ్రులను కలిసి వారికి అప్పగించాం - రష్మీ పెరుమాల్, నార్త్‌జోన్ డీసీపీ
Daughter reunites Parents in Karimnagar : మనస్పర్ధలతో దూరమై.. కూతురి సాయంతో ఒక్కటయ్యారు