Lok Sabha Polling Arrangements In Telangana 2024 : హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. సార్వత్రిక సమరంలో కీలకఘట్టమైన పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈసీ నిర్దేశించిన మేరకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తికాగా తమకు కేటాయించిన సెంటర్‌లకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది చేరుకోనున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 37లక్షల 80వేల మంది ఓటర్లుండగా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
లోక్‌సభ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కోసం 3వేల 228 కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7 డీఆర్సీల వద్ద ఈవీఎంలు, వీవి ప్యాట్‌లను అధికారులు స్ట్రాంగ్ రూంలలో సిద్ధంగా ఉంచారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గపరిధిలో మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ర్యాండామైజేషన్ ద్వారా ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలించి స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి నేడు పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సీసీ కెమెరాల నిఘానీడలో పోలింగ్ జరిపేలా ఏర్పాట్లు చేశారు. గుర్రంగూడ స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన శిక్షణా తరగతులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక హాజరై పోలింగ్ అధికారులకు సూచనలు చేశారు.
Telangana Loksabha Elections 2024 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, వరంగల్ లోక్‌సభ స్థానాలకు రేపు జరిగే పోలింగ్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్నం ఎనుమాముల మార్కెట్లో ఈవీఎంలు, ఇతర సామగ్రి పంపిణీ జరగనుంది. వరంగల్ లోక్‌సభ స్థానంలో మొత్తం 42 మంది అభ్యర్థులు బరిలో దిగగా 1900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 247 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించగా నగర కమిషనరేట్ పరిధిలో 7 కేంద్ర బలగాలు సహా ఐదు వేలమంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి 23 మంది అభ్యర్థులు బరిలో నిలువగా 1809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 335 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించిన పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్ పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయినందున రేపు సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది.
ఎన్నికల వేళ కట్టుదిట్టమైన చర్యలు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో 61 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించనున్నారు. పోలింగ్ నిర్వహణకి అధికారులు ఏర్పాట్లు చేయగా ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల వేళ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ అభిషేక్ మహంతి తెలిపారు. గత ఎన్నికల్లో వివిధ చోట్ల నమోదైన పోలింగ్ శాతంతో పాటు జరిగిన గొడవలు, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Nizamabad Polling Arrangements : నిజామాబాద్ లోక్‌సభ పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ పరిధిలో రెండు జిల్లాలు, 7 నియోజకవర్గాలుండగా 1808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 17లక్షల 4వేల 867 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు వీలుగా వెసులుబాటు కల్పించగా జిల్లాలో 1772 మంది ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్‌సభకు పోటీలో 29 మంది అభ్యర్థులు ఉన్నందున పోలింగ్ కోసం రెండు చొప్పున బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. ఎండవేడిమి దృష్ట్యా పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.