Leopard Trapped At Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. గత ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మేక మాంసం ఎరగా వేయడంతో గురువారం రాత్రి అదే వచ్చి బోనులో చిక్కుకుంది. దీన్ని పట్టుకోవడానికి అధికారులు ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. చిరుత సంచారంతో ఐదు రోజులుగా స్థానికులు ప్రాణభయంతో గడిపారు. తాజాగా చిక్కడంతో అటు అధికారులు, ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
చిరుత పూర్తి ఆరోగ్యంగా ఉంది : చిరుత పూర్తి ఆరోగ్యంగా ఉందని ఎఫ్‌డీవో విజయానందరావు తెలిపారు. గురువారం రాత్రి 8:00 గంటల ప్రాంతంలో అది బోనులో చిక్కిందని చెప్పారు. మేకమాంసం ఎరగా వేయడంతో చిరుత బోనులో పడినట్లు పేర్కొన్నారు. దీనిని జూకు తరలించి వైద్యపరీక్షలు చేస్తామని, అక్కడి నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్‌లో వదులుతామని ఎఫ్‌డీవో విజయానందరావు వెల్లడించారు.
అసలేం జరిగిదంటే : గత నెల 28న తెల్లవారు జామున 3:30 గంటలకు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద విమానాశ్రయం ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. చిరుత దూకే సమయంలో ఎయిర్‌పోర్ట్ గోడకు ఉన్న ఫెన్సింగ్‌కు తగలడంతో అలారం మోగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిజేయగా వారు రంగంలోకి దిగారు.
ఆస్పత్రిలోకి దూరి చిరుత బీభత్సం- 4 గంటలు శ్రమించి బంధించిన సిబ్బంది
Leopard in Shamshabad Airport : దీంతో ఎయిర్‌పోర్టు పరిసరాల్లోకి చేరుకున్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే విమానాశ్రయం చుట్టుపక్కల 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు మేక మాంసాన్ని ఎరగా పెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో, ఈసారి ఏకంగా 5 మేకలను బోనుల్లో ఉంచారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చిరుత మాత్రం చిక్కలేదు. ఒకే ప్రాంతంలో సంచరిస్తూ బోను వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
మంగళవారం రాత్రి ఓ బోను వద్దకు చిరుత వచ్చింది. అందులో ఉన్న మేక జోలికి మాత్రం వెళ్లలేదు. అక్కడ అది తచ్చాడిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు చిరుతను బోనులో బంధించడానికి ప్రయత్నం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఎట్టకేలకు చిరుత గురువారం రాత్రి ఒక బోనులోకి దూరి అక్కడ చిక్కుకుపోయింది.
Leopard Wanders in Sangareddy Video Viral : పంట పొలాల్లో చిరుత సంచారం.. వీడియో వైరల్