Land Registration Value Increase in Telangana : రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపులకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తును దాదాపు పూర్తి చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా క్షేత్రస్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖతోపాటు రెవెన్యూ శాఖ అధికారులు పర్యటించారు. సర్వే నంబర్ల వారీగా మార్కెట్ విలువను పరిశీలించారు. శాస్త్రీయబద్ధంగా మార్కెట్ విలువలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కమర్షియల్ ప్రాంతంగా గుర్తించేందుకు ముందే నిర్దేశించిన వివిధ పారామీటర్లు అక్కడ కనిపిస్తే కమర్షియల్‌గా పరిగణిస్తారు. గతంలో నాన్ కమర్షియల్ ప్రాంతంగా ఉండి ఇప్పుడు అ ప్రాంతంలో కమర్షియల్‌గా అభివృద్ధి చెంది ఉంటే అక్కడ ఎంత వీలైతే అంత మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం అనుమతే ఆలస్యం : భూములు, ఖాళీ స్థలాలు, గృహాలు ఈ మూడింటికి సంబంధించి ప్రాంతాల వారీగా ప్రస్తుత ఓపెన్ మార్కెట్ విలువలు, పెంచాలనుకుంటున్న విలువలను అంచనా వేసుకుని నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. గ్రామాలు, ప్రాంతాల వారీగా సిద్ధం చేసిన ఈ నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి అనుమతి ఇస్తే తదుపరి శాఖాపరంగా చేయాల్సిన కార్యాచరణ మొదలవుతుంది. అపార్ట్‌మెంట్లు కొనుగోలుపై ఇప్పుడున్న మార్కెట్ విలువ కన్నా 20 నుంచి 35 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ, ఓపెన్ మార్కెట్ విలువ రెండింటిని బేరీజు చేసుకుని విలువ పెంచే అవకాశం ఉంది. ఓపెన్ ప్లాట్లు ధరలు ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, వరంగల్ తదితర చోట్ల స్టాంపులు, రిజిస్ట్రేషన్ పెంపునకు కసరత్తు పూర్తి చేసింది. రెండు రోజుల్లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యి పెంపునకు గ్రీన్ సిగ్నెల్ తీసుకుంటారని తెలుస్తోంది. ఆగస్టు 15 తర్వాతే నూతన మార్కెట్ ధరలు అమలులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ విలువలో 50 శాతానికి మించి మార్కెట్ విలువలు పెంచరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నల్గొండ దేవాదాయ భూములపై రియల్ ఎస్టేట్ పంజా - అధికారులకు సైతం పట్టని భూ ఆక్రమణలు