School Students Facing Problems : ప్రభుత్వంపై నమ్మకంతో సర్కారు బడుల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పిల్లలను పంపిస్తుంటారు. కానీ అక్కడ సౌకర్యాల కొరతతో నానా అవస్థలు ఎదుర్కొంటూ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రెండు గదులలో 162 మంది విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేక నాణ్యమైన విద్య అందడం లేదు. విద్యార్థులకు సరైన పాఠాలకు నోచుకోని ఆ ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక కథనం.
విద్యార్థులకు తప్పని తిప్పలు : జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇందిరానగర్‌కు చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇది. యూకేజీ నుంచి ఐదో తరగతి వరకు కొనసాగుతున్న ఈ సర్కారు బడిలో 162 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో కేవలం రెండు గదులే ఉండడంతో విద్యార్థులు చదువులకు తిప్పలు తప్పడం లేదు. ఉన్న రెండు గదుల్లో ఒక గదిలో సగం తరగతి మిగతా సగం ఉపాధ్యాయుల గదిగా మధ్యలో బీరువాను అడ్డుగా పెట్టుకొని కొనసాగిస్తున్నారు. రెండు తరగతులను వరండాలో నడిపిస్తుండగా మరో తరగతికి చెట్ల కింద కూర్చుని విద్యను అందిస్తున్నారు.
ఇరుకు గదుల్లోనే పాఠాలు వింటున్న విద్యార్థులు : పాఠశాలలో విద్యార్థులందరూ ఇరుకైన గదిలో ఇబ్బంది పడుతూ కూర్చుని పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠం అర్థం కాక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠాలు సరిగా బోధించలేకపోతున్నామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటే అదనపు తరగతి గదులు నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
"మా పాఠశాలలో 162 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ స్కూల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ముగ్గురే ఉన్నారు. డిప్యుటేషన్‌పై ఇద్దరు ఉపాధ్యాయులు రావాల్సి ఉంది. అంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. అదనపు తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు." - తాహెర్, ప్రధానోపాధ్యాయుడు
తగినంతమంది ఉపాధ్యాయులు లేక : పాఠశాలలో వసతులతో పాటు ఉపాధ్యాయుల కొరత కూడా వేధిస్తోంది. 162 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు చదువుపై సరిగా దృష్టి సారించలేక పోతున్నారు. అదనపు తరగతుల నిర్మాణంతో పాటు డిప్యూటేషన్‌పై బోధనా సిబ్బంది నియమించాలని కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి మరో మూడు గదులు నిర్మించి ఉపాధ్యాయులను కేటాయించి నాణ్యమైన విద్యనందించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
పాఠాలు వింటుంటే ప్రాణం పోతుందేమో - బడికి వెళ్లాలంటే భయమేస్తోంది - MALCHELMA GOVT SCHOOL PROBLEMS
మా బడి పరిస్థితి మారదా? - వరద నీటిలో పాఠశాలకు విద్యార్థులు - INAVOLU SCHOOL FLOODED DUE TO RAIN