Lack Of Facilities In Govt School In Khammam : అదో ప్రభుత్వ పాఠశాల. పేరుకు మాత్రమే సర్కారు బడి. పక్కా భవనం లేదు. తరగతి గదులకు అతీగతీ లేదు. అయినా అదీ విద్యాలయమే. ఉన్నది ఒకే ఒక్క రేకులషెడ్డు. దానిపక్కనే పరదాలతో వేసుకున్న మరో గది. గట్టిగా గాలివీస్తే విద్యార్థుల పుస్తకాలు చెల్లాచెదురవుతాయి. చినుకుపడితే పిల్లలంతా బడి నుంచి పరుగులు పెట్టాల్సిన దుస్థితి. అదే ఖమ్మం జిల్లా సాయినగర్ పరిధిలోని రజకవీధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.
కనీస సౌకర్యాలు లేమి : ఇది ఏ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయమని అనుకుంటే మాత్రం పొరపడినట్టే. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్నా సమస్యల వలయంలో కునారిల్లుతున్న సరస్వతీ విద్యాలయం దయనీయ పరిస్థితి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
"మేము చదువుకునేందుకు ఒకటే గది ఉంది. 50 మంది విద్యార్థులం ఇక్కడ విద్యనభ్యసిస్తున్నాం. పాఠాలు వినేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎండవస్తే కళ్లు తిరుగుతాయి. వానవస్తే తడుస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది' -విద్యార్థులు
ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ : ఓ వైపు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ విద్యార్థులు చదువులు సాగిస్తున్న సరస్వతి నిలయం ఇది. ఏళ్లుగా ప్రభుత్వం నుంచి భవన సదుపాయం లేక విద్యార్థులు పరదాల కిందే చదువులు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పరదాలు, రేకుల షెడ్డు, వీటి కిందనే విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న విద్యార్థులు ఇక్కడ సమస్యల నడుమ చదువులు సాగిస్తున్నారు.
" 2016 నుంచి ఈ పాఠశాల అద్దె భవనంలో నడుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో కాలనీ ఏర్పాటు చేసే సమయంలో కొంత స్థలం ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయిస్తామని స్థానికులు చెప్పారు. ఈ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాం. అధికారులు వచ్చి స్థలాన్ని సర్వే చేసి ఇస్తామన్నారు. కానీ ఆ మాట ఆచరణకు నోచుకోలేదు. కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల పరిస్థితులు చూసి స్థలాన్ని కేటాయిస్తామన్నారు. సర్వేయర్‌కు ఈ విషయమై ఆదేశించారు. పాఠశాలకు స్థలం కేటాయించినట్లయితే పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది" - రాంబాబు, హెచ్ఎం
పాఠశాల దయనీయ స్థితిపై స్పందించిన మంత్రి : ప్రభుత్వ పాఠశాల దీనస్థితిపై ఈనాడు-ఈటీవీ భారత్ కథనంపై మంత్రి తుమ్మల స్పందించారు. పాఠశాల దయనీయ దుస్థితిపై ఆయన జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడారు. స్కూల్‌కు కావాల్సిన వసతులపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఖమ్మం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు.
పాఠాలు వింటుంటే ప్రాణం పోతుందేమో - బడికి వెళ్లాలంటే భయమేస్తోంది - MALCHELMA GOVT SCHOOL PROBLEMS