Lac Bangles In Charminar Lad Bazar : పురాతన కట్టడాలకు నెలవైన హైదరాబాద్ మహా నగరం, నాటి సంస్కృతిని పదిలంగా కాపాడుకుంటూ వస్తోంది. చారిత్రక కట్టడమైన చార్మినార్ పక్కనే ఉండే లాడ్ బజార్ మహిళల మనసు దోచుకుంటుంది. ఇక్కడ లభించే లక్క గాజులు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్‌లో మొదటగా హలీమ్‌కు భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత లక్క గాజులకు ఆ ఘనత దక్కింది.
లక్క గాజులకు ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా? రేసిన్ అనే పదార్థాన్ని కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దానిని గాజులాగా వృత్తాకారంలో మలిచి పూసలు, రాళ్లతో వివిధ రకాల డిజైన్ చేస్తారు. ఇంతటి ప్రత్యేక గుర్తింపు కలిగిన లక్క గాజులకు జీఐ గుర్తింపు రావటం అంటే, ఇక్కడ కళనే నమ్ముకుని బతికేస్తున్న కళాకారుల పని తనం ఎంతో ఉంది.
లక్క గాజులంటే మాకు చాలా ఇష్టం. మా ఇంట్లో పెళ్లైనా, పేరంటమైనా ఇక్కడికి వచ్చే గాజులను కొనుగోలు చేస్తాం. రాళ్లతో వివిధ రకాల డిజైన్ గాజులు అందంగా ఉంటాయి. ఇక్కడ తక్కువ రేటులో మంచి గాజులు దొరుకుతాయి. అందుకే ప్రతి పండుగలకు లాడ్ బజార్లోనే గాజులు తీసుకుంటాము. - వినియోగదారులు
హైదరాబాద్‌కు మరో గౌరవం - ఓల్డ్ సిటీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు
Hyderabad Lac Bangles Geographical Indication : మొఘలుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గాజులను అప్పట్లో కేవలం మహారాణులు మాత్రమే ధరించేవారు. నేడు సామాన్యులకు కూడా చేరువయ్యాయి. ప్రత్యేకించి పర్యాటకులు వీటిని కొనకుండా వెళ్లలేరు. పెళ్లైనా, పేరంటమైనా ఇక్కడికి వచ్చే గాజులను కొనుగోలు చేస్తామని కొనుగోలుదారులు అంటున్నారు. ఇంతటి ఖ్యాతి పొందటం వెనక ఇక్కడ పని చేసే హస్త కళాకారుల పాత్ర ఎంతో ఉంది. లక్క గాజులు తయారీపై ఆధారపడి 6 వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ జీఐ ట్యాగ్ రావటం వల్ల వీరందరికీ గుర్తింపు వచ్చినట్లయింది. చిన్న ప్రోత్సాకమే, పెద్ద పనులు చేయటానికి ప్రేరణనిస్తుంది. వీరికి కూడా జీఐ ట్యాగ్ వల్ల వారి పనితనానికి, కష్టానికి గుర్తింపు లభించినట్లుగా వీరు భావిస్తున్నారు.
లాడ్ బజార్ లక్కగాజులకు భౌగోళిక గుర్తింపు వచ్చే రోజుల్లో మరిన్ని కొత్త డిజైన్లను ప్రజలకు పరిచయం చేయటానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. ఇక్కడి నుంచే దేశ విదేశాలకు లక్క గాజులను ఎగుమతి చేస్తున్నామని చార్మినార్ గాజులు ఇంతటి ప్రసిద్ధి చెందటం సంతోషంగా ఉందని వ్యాపారులు అంటున్నారు. వందల ఏళ్ల చరిత్ర గల లాడ్ బజార్ లక్కగాజులకు భౌగోళిక గుర్తింపు రావటం రాష్ట్రానికే గర్వకారణంగా ఉంది. ఉగాది, రంజాన్ పండుగుల సందర్భంగా లక్క గాజుల కోసం ప్రజలు పెద్ద సంఖ్యల్లో తరలిరావడంతో గాజుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.