Kurnool District People Angry on CM Jagan Bus Yatra : ఉమ్మడి కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఊళ్లకు ఊళ్లూ ఖాళీ అవుతున్నాయి. ఉపాధి సంగతి దేవుడెరుగు కనీసం తినడానికి తిండిలేక, తాగడానికి నీరు లేక పొట్ట చేత పట్టుకుని వలసలు పోతున్నారు. పట్టణాల్లో కూలి పనులకు, గుంటూరు జిల్లాల్లో మిర్చి కోతలకు ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు. ఏ గ్రామం చూసినా ఇళ్లకు తాళాలు వేసే దర్శనమిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు అప్పులపాలయ్యారు. ఐదేళ్లుగా కర్నూలు జిల్లాలో ఇవే పరిస్థితులు దర్శనమిస్తున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఏమాత్రం చలనం లేదు. కనీసం కరవు నివారణ చర్యలు చేపట్టకపోయినా పర్వాలేదు గానీ వలసలను సైతం అడ్డుకోలేకపోయారు.
గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పర్యటించిన జగన్ వలసల నివారణకు అనేక హామీలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు నిర్మిస్తామని రైతులను ఆదుకుంటామని ఊదరగొట్టారు. అప్పుడు వెళ్లడమే తప్ప మళ్లీ అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మళ్లీ ఆరున్నరేళ్ల తర్వాత మరోసారి ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు బస్సుయాత్ర పేరిట రావడంపై స్థానికులు మండిపడుతున్నారు. అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పులు వచ్చాయేమో ఒక్కసారి బస్సు దిగి చూడాలని కోరుతున్నారు. రహదారిపై బస్సులో తిరగడం కాదని కాలినడకన పల్లెల్లోకి వస్తే జనం గోస కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అస్మదీయులకు దోచిపెట్టేందుకే - మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు వెనుక భారీ స్కెచ్!
ప్రశ్నార్ధకంగా నష్టపరిహారం: గత రెండు సీజన్లలో కర్నూలు జిల్లాను కరవు కమ్మేసింది. కృష్ణానదిలోకి చుక్కనీరు రాలేదు. ప్రాజెక్ట్‌లన్నీ వెలవెలబోతున్నాయి. చెరువులు ఎండిపోగా బోరుబావులు అడుగంటాయి. పంటలన్నీ దెబ్బతిని అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇన్నాళ్లు పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల ముందు కరవు మండలాలు అయితే ప్రకటించింది. కానీ పంట నష్టపరిహారం ఎవరిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. 2,38,230 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతినగా 371 కోట్ల పంట నష్టపరిహారం రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఉద్యాన పంటలతో కలిసి 433 కోట్ల పంట నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ ద్వారా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో విడుదల చేశారు. కానీ ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బు జమకాలేదు.
ప్రాజెక్టులకు నిధులు నిలిపివేత: కర్నూలు జిల్లాలో కరవు నివారణకు తుంగభద్ర నదిపై 20 టీఎంసీలతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించేందుకు 2019 ఫిబ్రవరి 21న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం 2,890 కోట్లు మంజూరు చేసింది. పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చినా ఐదేళ్లలో కనీసం పరిపాలన అనుమతులు కూడా ఇవ్వలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వలస నివారణకు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. ఆలూరు, ఆదోని నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు చంద్రబాబు హయాంలో 8 టీఎంసీల సామర్థ్యంతో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు, 29 గ్రామాలకు తాగునీరు అందించేందుకు వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పరిస్థితి మారిపోయింది. 8 టీఎంసీలను మూడు టీఎంసీలకు తగ్గించారు. అయినా పనులు చేపట్టలేదు.
జగన్ సర్కార్ నిర్లక్ష్యం - భారీగా పెరిగిన పోలవరం నిర్మాణ అంచనాలు
ఉచిత విద్యుత్ హామీ గాలికి: పశ్చిమ ప్రాంతంలో కరవు, వలసల నివారణకు పందికొన ప్రాజెక్టు అత్యంత కీలకమైనంది. కృష్ణా మిగులు జలాల మీద నిర్మించిన హంద్రీనీవా ప్రాజెక్టుకు, ఏపీ రాష్ట్ర విభజన చట్టం అనుమతించింది. టీడీపీ హయాంలో కాలువల విస్తరణలో భాగంగా కొంత వరకు పంటకాలువలు, సూయిజ్‌లు నిర్మించారు. మిగిలిన పనులు చేసి నీరందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. చిప్పగిరి మండలం నగరడోన రిజర్వాయర్, ఆలూరు బ్రాంచ్ కెనాల్ కాలువపై నగరడోణ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు లేక నిలిచిపోయాయి.
టమోటా అధికంగా పండించే పశ్చిమ ప్రాంతంలో 10 కోట్లతో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ఎమ్మిగనూరు బనవాసి వద్ద గత ప్రభుత్వం టెక్స్‌టైల్ పార్కుకు శ్రీకారం చుట్టగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి ఆ స్థలాన్ని జగనన్న కాలనీకి కేటాయించింది. జిల్లావ్యాప్తంగా 17వేలమంది చేనేత కార్మికులు ఉంటే వడ్డిలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి పైసా నిధులు ఇవ్వలేదు. నేతన్నలకు ఇస్తామన్న ఉచిత విద్యాత్ హామీ గాలికి వదిలేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారని సీఎం జగన్‌ను స్థానికులు నిలదీస్తున్నారు.
'5పర్సెంట్ మినిస్టర్' పక్కా ప్లాన్! - వచ్చే ఏడాది పనులు సైతం పాత కాంట్రాక్టర్‌కే
జిల్లావ్యాప్తంగా దాహం కేకలు: మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వందలాది గ్రామాలు ఖాళీ అయ్యాయి. కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలాల నుంచి పెద్దఎత్తున జనం వలసబాట పట్టారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచే లక్షమందికి పైగా వలస వెళ్లారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లుదేవకుంటలో బోర్లు ఎండిపోవడంతో ఇప్పటికీ తాగునీటికి 4కిలోమీటర్లు దూరం ఉన్న చిలకలదోణ, ఇబ్రహీంపురం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో గ్రామం మొత్తం వలస బాట పట్టింది.
పశ్చిమప్రాంతం అభివృద్ధి కోసం పరిశ్రమలను తీసుకొచ్చేలా ఆడాను ఏర్పాటు చేశారు. కొత్తవి ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటికీ ప్రోత్సాహం ఇవ్వడం లేదు. చిన్న పరిశ్రమలు మూతపడి ప్రజలు ఉపాధి కోల్పోయారు. వాణిజ్యపరంగా రెండో ముంబయిగా పేరుగాంచిన ఆదోనిలో మూడు స్పిన్నింగ్ పరిశ్రమలు మూతపడ్డాయి. ఏటా వెయ్యికోట్ల టర్నోవర్‌తో పదివేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందికపోవడంతో మూతపడ్డాయి. కరవు మండలాల్లో తాగునీటి ఎద్దడికి అధికారులు గతేడాది డిసెంబర్‌లోనే ప్రతిపాదనలు పంపినా ఒక్కపైసా విదిల్చలేదు. ఎండలు పూర్తిస్థాయిలో ముదరకుండానే జిల్లావ్యాప్తంగా దాహం కేకలు వినిపిస్తున్నాయి.