KTR Comments On Phone Tapping : తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. లీకు వీరుడు సీఎం లీకులు ఇస్తున్నారని ఆక్షేపించారు. హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ తనకు ఎందుకన్న కేటీఆర్ ఆరోపణలు చేసిన మంత్రికి బుర్ర పనిచేస్తుందా అని ప్రశ్నించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపణలు చేశారని తెలియజేశారు. 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ జరిగి ఉంటే అప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు మహేందర్ రెడ్డి, శివధర్ రెడ్డి, సజ్జనార్, రవి గుప్తా లాంటి అధికారులకు తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తన ఫోన్ నిఘాలో ఉన్నాయని ఆపిల్ సంస్థ 2022 లో మెసేజ్ కూడా పంపిందని గుర్తు చేశారు.
"ఫోన్ ట్యాపింగ్‌పై నాకు ఎలాంటి సంబంధం లేదు. అడ్డగోలుగా మాట్లాడితే మంత్రినైనా, సీఎంనైనా వదిలిపెట్టను.తప్పుడు ఆరోపణలు చేసేవారిపై న్యాయపరంగా వెళ్తాను. నేను హీరోయిన్లను బెదిరించినట్లు మంత్రి ఆరోపించారు.హీరోయిన్లను బెదిరించాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లీక్ వీరుడు. ఫోన్ ట్యాపింగ్‌పై నేరుగా మాట్లాడే ధైర్యం రేవంత్‌కు లేదు. ఫోన్ ట్యాపింగ్‌పై 2004 నుంచి వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలి." -కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
KTR Warning To Congress Leaders : ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు ఇస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంత్రితో పాటు ఇద్దరు నేతలు న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్పై కక్షతో నీటిని సముద్రంలోకి వదిలారని, దేశంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీని మించిన చెల్లని నోటు ఇంకా ఎక్కడైనా ఉందా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 218 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనర్హతా పిటిషన్లు మూడు నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దానం, కడియం సభ్యత్వాలు రద్దయి ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేటీఆర్ అన్నారు.