Kodelu Distribution Program in Vemulawada : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆర్నెళ్ల తర్వాత కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. గతంలో కోడెల వితరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా గోశాలలో సామర్ధ్యానికి మించి కోడెలు, ఆవులు పేరుకుపోయాయి. వాటికి వ్యాధులు సంక్రమిస్తాయని భావించిన యంత్రాంగం కలెక్టర్ ఆదేశాలతో రైతులకు కోడెల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
వేములవాడ రాజన్న దరశనానికి వచ్చే భక్తులు కోడె మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అలా వచ్చిన కోడెలు, ఆవులను తిప్పాపూర్ గోశాలలో ఆలయ అధికారులు సంరక్షిస్తుంటారు. వాటిని ఎప్పటికపుడు భూమిపుత్రులకు అందజేస్తుంటారు. ఇటీవల ఆర్నెళ్ల నుంచి పంపిణీ చేయకపోవడం వల్ల గోశాలలో సామర్థ్యానికి మించి మూగజీవాలు వచ్చి చేరాయి. గతంలో గోశాల ఫెడరేషన్ ద్వారా కోడెలను కర్షకులకు అప్పగించేవారు. పథకం పక్కదారి పట్టిందనే ఆరోపణలతో జనవరి నుంచి కోడెల వితరణ నిలిపివేశారు.
రాజన్న కోడెలకు రామడుగు నుంచి పశుగ్రాసం
గోశాలలో 500 కోడెలు ఉండడానికి సౌకర్యాలుండగా, ప్రస్తుతం 1800 వరకు ఉన్నాయి. గోశాల నుంచి కోడెలను నిజమైన లబ్ధిదారులకు అందించేందేకు కలెక్టర్ ఆధ్వర్యంలో విధివిధానాలు రూపొందించించారు. అందుకు అనుగుణంగా కోడెల పంపిణీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. 511 మంది రైతులకు రెండు కోడెల చొప్పున పంపిణీ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎవరైనా కోడెల సంరక్షణ భారమని భావిస్తే తిరిగి గోశాలలో అప్పగించవచ్చని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
రైతులకు కోడెలను అప్పగించిన అనంతరం వారి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా వాటి సంరక్షణను అధికారులు పర్యవేక్షించనున్నారు. కోడెలను ఇతరులకు అమ్మబోమని, తామే సాకి వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటామని రైతుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కోడెలకు ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఎదురైనా ఆలయాధికారులకు సమాచారం ఇస్తే పశువైద్యాధికారిని పంపించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు. కోడెలను పొందిన రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కోడెల పంపిణీని ప్రారంభించాం. గతంలో కొడేల పంపిణీలో అక్రమాల ఆరోపణలు జరిగాయని వార్తలు రావడంతో పంపిణీని ఆపేశాం. గత కొంత కాలంగా కోడెల సంఖ్య పెరిగింది. ఇప్పడు గోశాలలో సుమారు 1800పైగా కోడెలు, ఆవులు ఉన్నాయి. వాటి నిర్వహణ ఇబ్బందిగా ఉంది. అలాగే రైతుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కోడెల పంపిణీని మళ్లీ ప్రారంభించాం. ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో విధివిధానాలు రూపొందించారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. వినోద్, ఆలయ కార్యనిర్వహణాధికారి