Kishan Reddy on Thousand Pillar Temple : వేయి స్తంభాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మధ్యయుగంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని తెలిపారు. తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని వివరించారు. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో పునర్నిర్మించిన కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు : కిషన్ రెడ్డి
ఈ సందర్భంగా దేవాలయంలో పునర్నిర్మించిన కల్యాణ మండపాన్ని కిషన్‌రెడ్డి (Kishan Reddy)ప్రారంభించారు. అంతకుముందు ఆయన ఆలయంలో కుటుంబ సమేతంగా రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ యాగశాలలో హోమం చేసి, కల్యాణ మంటపంలో శాంతి కల్యాణం నిర్వహించారు. మంటపం నిర్మాణంలో పాలుపంచుకున్న శిల్పులను కిషన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు.
వేయిస్తంభాల గుడిలో కల్యాణమండపం ప్రారంభించడం సంతోషంగా ఉందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. పునర్నిర్మాణం చేసిన కల్యాణమండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేశామని, దీంతో సంపూర్ణమైన వేయి స్తంభాల దేవాలయం పూర్తైందని తెలిపారు. తాను సాంస్కృతికి శాఖ మంత్రి అయిన తర్వాత ఈ గుడిపై సమీక్ష చేశానని కిషన్‌రెడ్డి చెప్పారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
"మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహా దేవుడికి కల్యాణ మండపం అంకితం చేస్తున్నాం. 132 స్తంభాలతో నిర్మించిన కొత్త కల్యాణ మండపంతో వెయ్యి స్తంభాల గుడికి ఆ పేరు సార్థకమైంది. కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతం. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. కాకతీయుల శిల్ప కళావైభవాన్ని మన తర్వాతి తరాల కోసం కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నాను." - కిషన్‌రెడ్డి. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
Thousand Pillar Temple : వేయిస్తంభాల గుడికి (Thousand Pillar Temple)అనుబంధంగా నిర్మితమైన కల్యాణ మండపం అది. క్రీ.శ.1163లో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. దాదాపు 800 సంవత్సరాలకు పైగా సేవలందించింది. అనంతరం ఆ నిర్మాణం కొన్నేళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకుంది. పునర్నిర్మాణానికి కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 2006 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. రూ.15 కోట్లతో ఆకృతిలో మార్పు చేయకుండా అప్పటి శిలలు/శిల్పాలనే 90 శాతం వినియోగించి మండపం పునర్నిర్మిణం చేశారు.
అంకెలు వేసి ఊడదీసి :
- మొదట మండపంలోని 132 స్తంభాలు, 160 దిమ్మెలు, ఏడు పొరలుగా ఉన్న ఆధారపీఠం, 5 పొరలుగా ఉన్న ఉభయ పీఠం, ప్రదక్షిణ పాదం, ఇతర కళాకృతులు కలిపి మొత్తం 3,200 శిలలు/శిల్పాలపై అంకెలు వేసి జాగ్రత్తగా తొలగించి పక్కన పెట్టారు. వీటిలో 2,540 శిల్పాలను తిరిగి వినియోగించారు. కేవలం 10 శాతం శిల్పాలు పూర్తిగా దెబ్బతినడంతో వాటి స్థానంలో శిల్పులు కొత్తవి చెక్కారు.
- అప్పట్లో శాండ్‌బాక్స్ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ మండపం పునాది కింద 5 మీటర్ల లోతున్న ఇసుకను తొలగించి, మళ్లీ అదే పరిజ్ఞానంతో పునాదిని నిర్మించారు. తర్వాత ఎక్కడా సిమెంట్, స్టీలు వాడకుండా డంగుసున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో భారీ పాత శిలలను ఇంటర్‌లాకింగ్ విధానంతో అతికించారు.
- తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ నేతృత్వంలో 60 మంది శిల్పులు పునర్నిర్మాణానికి శ్రమించారు. అప్పటి దండయాత్రల్లో వేయిస్తంభాల గుడి, కల్యాణమండపం మధ్యనున్న భారీ నంది శిల్పాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం కృష్ణశిలను చూర్ణంగా చేసి రసాయన మిశ్రమంతో కలిపి ధ్వంసమైన తోక, చెవులు, కాళ్లను యథావిధిగా అమర్చి ప్రాణప్రతిష్ఠ చేశారు.
తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రధాని నిధులు మంజూరు చేయడం హర్షనీయం : కిషన్ రెడ్డి