Rammohan Naidu Takes Oath as Cabinet Minister : కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వరుసగా మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా, కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి తెలుగుదేశం తరపున తొలిసారి కేంద్రమంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.
రామ్మోహన్నాయుడు చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏపీ తరఫున కేంద్రమంత్రులుగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మకు చోటు లభించింది.
TDP MP Rammohan Naidu as Union Minister : కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఆశీర్వాదమే తనను ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు.
తనకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ, ప్రోత్సహిస్తున్న తమ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు, సోదర భావంతో చూస్తున్న లోకేశ్ అన్న, పవన్ కల్యాణ్, నరేంద్రమోదీ, బాబాయి అచ్చెన్నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేస్తేనే, తాను మూడుసార్లు ఎంపీగా గెలవడానికి కారణమయ్యారని పేర్కొన్నారు.
శ్రీకాకుళం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రామ్మోహన్ నాయుడు : తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మరో ప్రధాన కారణం మా శ్రీకాకుళం ప్రజలని మరోసారి పేర్కొన్నారు. తనపై వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎంత వరకూ తీసుకొచ్చాయో ఈరోజు అంతా చూస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
"తెలుగు ప్రజలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఎన్డీయే కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు మనందరికీ చాలా ఉజ్వలంగా కనిపిస్తోంది. నరేంద్రమోదీ, చంద్రబాబు నేతృత్వంలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. వచ్చే ఐదేళ్లలో మ్యానిఫెస్టోలో మీకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున శక్తివంచన లేకుండా పనిచేసి మీకందరికి న్యాయం చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కష్టపడతాం."-రామ్మోహన్నాయుడు, కేంద్ర మంత్రి
మేము ఎన్డీఏ కూటమితోనే ఉన్నాం - చంద్రబాబు క్లారిటీ - CHANDRABABU PRESS MEET TODAY