Reasons for Kharif Cultivation Delay in Telangana : వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు దాటినా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు చెప్పుకోతగ్గట్టుగా ప్రారంభం కాలేదు. దీంతో ఖరీఫ్ ఆయకట్టు సాగు జాప్యమయ్యేలా కనిపిస్తుంది. తెలంగాణలో వానాకాలంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద సుమారు 45 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. అయితే, కొన్ని జిల్లాల్లో జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదైంది. అలాగే ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట చాలా నామమాత్రంగా ఉంది.
ప్రాణహిత నుంచి మేడిగడ్డకు 16వేల క్యూసెక్కులు వస్తుంది. అలా వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులన్నీ నీటి ప్రవాహం తక్కువగా ఉంది. కృష్ణా బేసిన్‌లో కీలకమైన శ్రీశైలంలోకి ఇప్పటివరకు కేవలం ఆరున్నర టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. నాగార్జునసాగర్‌లోకి దాదాపుగా ఏమీ లేనట్లే. ఎగువన ఉన్న జూరాలలోకి ఏడు టీఎంసీల వర్షపు నీరు రాగా, తుంగభద్రలోకి కూడా కేవలం ఎనిమిది టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరిగితే కానీ ఆయకట్టుకు ఎప్పటి నుంచి నీటిని విడుదల చేయాలన్నదానిపై నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు ఆ పరిస్థితి కనిపించకపోవడం లేదు. నీటి లభ్యతపై ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం సైతం నిర్వహించలేదు.
వానాకాలం సీజన్‌కు విత్తన లభ్యతపై తుమ్మల సమీక్ష - పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ వివరాలపై ఆరా - Tummala Review on Seed Availability
కృష్ణాబేసిన్‌లో ఎగువన కర్ణాటకలో ఉన్న ఆలమట్టిలోకి కూడా ప్రవాహం కూడా అంతంత మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఆలమట్టిలోకి 25 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. శుక్రవారం కొంత ప్రవాహం పెరిగి 53వేల క్యూసెక్కులు వస్తోంది. ఆలమట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లలోకి 90 టీఎంసీలకు పైగా వస్తే కానీ దిగువన ఉన్న జూరాల, శ్రీశైలంలోకి నీటి విడుదల చేయలేని పరిస్థితి. గత సంవత్సరం వర్షాభావంతో ఆయకట్టు సాగుపై తీవ్ర ప్రభావం పడింది.
గోదావరి బేసిన్‌లో: గోదావరి బేసిన్‌లో సైతం వర్షపునీటీ ప్రవాహం ఆశాజనకంగా లేదు. రాష్ట్రంలో అత్యధిక ఆయకట్టు ఉన్న శ్రీరామసాగర్‌లోకి కేవలం ఐదు టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. సింగూరు, నిజాంసాగర్‌లలోకి ఏమీ రానట్లే. కడెం, ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువ మానేరు ఇలా అన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి కూడా నీటి ప్రవాహాలు లేవు. రెండు బేసిన్లలోని 36 మధ్యతరహా ప్రాజెక్టుల కింద నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంటుంది. పెద్దవాగు, జగన్నాథపూర్, తాలిపేరు మినహా మిగిలిన మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు లేకపోవడంతో వీటి కింద కూడా సాగు జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
ఖరీఫ్ సీజన్‌పైనే రైతుల ఆశలు - ఈసారైనా పంటలు బాగా పండాలని ఆకాంక్ష - KHARIF SEASON CULTIVATION