Mystery Behind the Murder of his Wife and Daughters in Khammam : దాదాపు 45 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రఘునాధపాలెంలోని తల్లి, ఇద్దరు కుమార్తెల మృతిపై మిస్టరీ వీడింది. ఈ దారుణానికి ఒడిగట్టింది కట్టుకున్న భర్త ప్రవీణ్ కుమార్‌నే అని పోలీసులు నిర్ధారించారు. వారిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు తేల్చారు. విషం కలిపిన ఇంజక్షన్ ఇచ్చి భార్యను హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రఘునాధపాలెం పీఎస్‌లో మే 29న అనుమానాస్పద కేసుగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఏడాది మే 28న బాబోజితండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్, తన భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు రఘునాధపాలెం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా అకస్మాత్తుగా వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆ చిన్నారులు ఇద్దరు మృతి చెందారు. రోడ్డు పక్కన వెళుతున్న వారు కారులోని వారిని బయటకు తీశారు.
అపస్మారక స్థితిలో ఉన్న డాక్టర్ ప్రవీణ్ భార్య కుమారిని 108 అంబులెన్సు సిబ్బంది ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో డాక్టర్ ప్రవీణ్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయనను బంధువులు ఆటోలో మరో ఆసుపత్రికి తరలించారు. కుమారి భర్త ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపణలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు.
ముగ్గురి మృతదేహాలపై గాయాలు కనిపించకపోవడంతో ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం రఘునాధపాలెం పోలీసు స్టేషన్‌లో పోలీసులు మే 29న అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అనంతరం మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. 45 రోజుల తర్వాత శవపరీక్ష నివేదికలో భార్య, ఇద్దరు పిల్లలను భర్త ప్రవీణ్ హత్య చేసినట్లు నిర్ధారణకు పోలీసులు వచ్చారు.
నిందితుడిని పట్టించిన ఖాళీ సిరంజ్ : ఈ ఘటన జరిగిన రోజు పోలీసులు కారును తనిఖీ చేయగా ఖాళీ సిరంజ్ దొరికినట్లు తెలిపారు. దాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించగా విషం కలిపిన ఇంజక్షన్‌గా తేల్చారు. ప్రవీణ్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా అందులో కూడా కీలక ఆధారం లభ్యమైనట్లు పోలీసులు వివరించారు. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ ఇస్తే ఎన్నిగంటల్లో చనిపోతారనే విషయాలను ప్రవీణ్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.