Karimnagar Boy Wins National Gold Medal In Yoga : జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఆ బాలుడు అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. శరీరాన్ని విల్లులా వంచుతూ అబ్బురపరిచి అండర్ 14 విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఇది తెలంగాణకు తొలి పతకం కాగా, రాష్ట్రానికి 36 ఏళ్ల తర్వాత వచ్చిన పసిడి పతకం. ఆర్థికంగా ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని చిన్నారి దీపక్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
చిన్నారి దీపక్ యోగాలో అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ అండర్ 14 విభాగంలో పసిడి పతకాన్ని గెలిచుకుని తెలంగాణ ఘనతను చాటి చెప్పాడు. ఇది మూడున్నర దశాబ్దాల తర్వాత తెలంగాణకు లభించిన తొలి పసిడి పతకం. హిమాచల్‌ప్రదేశ్‌లో అక్టోబర్ 24 నుంచి 27 వరకు జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ యోగా పోటీల్లో రాష్ట్రం నుంచి 28 మంది పాల్గొన్నారు. అందులో చిన్నారి దీపక్ బంగాల్ కంటే 10 పాయింట్స్ అధికంగా సాధించి బంగారు పతకం సాధించాడు. కేంద్ర క్రీడల శాఖ మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదగా బంగారు పతకం అందుకున్నాడు.
"సోషల్ వెల్ఫేర్ స్కూల్లో యోగాలో ట్రయల్స్ వేస్తుంటే దీపక్ అందరికంటే ప్రత్యేకంగా కనిపించాడు. తను చాలా రకాల ఆసనాలు వేశాడు. అప్పుడు నిర్ణయించుకున్నా, ఇతనికి శిక్షణ ఇవ్వాలని. అలా దీపక్ ఇప్పటివరకు చాలా వాటిల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో పాల్గొన్నాడు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో పాల్గొని జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించాడు. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు." - గుంటి రామకృష్ణ, యోగా కోచ్
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం దేవంపల్లి సాంఘిక సంక్షేమ గురుకులంలో 8వ తరగతి చదువుతున్న దీపక్ సొంతూరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్. చిన్నప్పటి నుంచే వివిధ రకాల ఆసనాలు వేస్తుండటం గమనించి తల్లిందండ్రులు యోగా శిక్షణ ఇప్పించారు. శిక్షణ పొందిన అనంతరం దీపక్ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు. అలవోకగా శరీరాన్ని విల్లులా వంచుతూ ఎన్నో అవార్డులు సాధించేందుకు యత్నించడంపై శిక్షకుడు రామకృష్ణ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నో కఠినమైన ఆసనాలను క్షణాల్లో వేస్తుండటంతో కోచ్‌తో పాటు కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
"నేను ఐదో తరగతి నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా పోటీల్లో పాల్గొన్నాను. అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాను. నేను ఇంటర్నేషన్ స్థాయిలో మెడల్స్ గెలిచి కన్నవారికి మంచి పేరు తీసుకురావాలి." - పురాణం దీపక్, పతకం సాధించిన విద్యార్థి
చిన్నతనం నుంచే యోగాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపక్, గతేడాది దిల్లీలో జరిగిన ఫెడరేషన్ కప్ పోటీల్లోనూ సత్తా చాటాడు. శరీరాన్ని గిరగిరా తిప్పేయడం చిన్నప్పటి నుంచే సహజంగా వచ్చిందని చెబుతున్నాడు. అలవోకగా యోగాసనాలు వేస్తూ అబ్బురపరుస్తూ జాతీయ స్థాయిలో పోటీ పడి అవార్డులు సాధించడం ఆనందంగా ఉందని దీపక్ చెబుతున్నాడు. తనను ఆర్థికంగా ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. గ్రామానికి చెందిన దీపక్ జాతీయ స్థాయిలో పతకం సాధించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.