Kadiyam Kavya Dropped Lok Sabha Elections 2024 : తెలంగాణలో అధికారం కోల్పోయిన భారత్ రాష్ట్ర సమితి (BRS Leaders Migration in Telangana) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య బీఆర్ఎస్‌ను దిగ్భ్రాంతికి గురి చేశారు. గులాబీ పార్టీ తరఫు నుంచి పోటీ చేయలేనని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు.
Kadiyam Kavya To Join Congress అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, దిల్లీ మద్యం కుంభకోణం వంటి అంశాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోనూ స్ధానిక నాయకుల మధ్య సమన్వయం కొరవడి ఎవరికే వారే అన్నట్లుగా వ్యవహరించడంతో మరింత నష్టం జరుగుతోందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని కేసీఆర్, పార్టీ నేతలు, కార్యకర్తలు మన్నించాలని అన్నారు. తనకు బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు కడియం కావ్య (Kadiyam Kavya in Lok Sabha Polls) ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఖరారు కావడంతోనే కావ్య గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు.
Lok Sabha Elections 2024 : స్టేషన్‌ఘన్‌పూర్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో మంతనాలు జరిపిన హస్తం పార్టీ నేతలు కావ్యకు టికెట్ ఇప్పించేలా హామీ ఇచ్చారు. మొదటి నుంచి వరంగల్ స్థానంలో తన కుమార్తె కావ్యను బరిలో నిలపాలని కడియం శ్రీహరి భావించినా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోసం వెనక్కి తగ్గారు. అయితే ఆరూరి బీజేపీ గూటికి చేరడంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. మూడు రోజుల కింద కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు సైతం చెప్పారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో పునరాలోచనలో పడిన కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. వరంగల్ స్థానంలో దీటైన అభ్యర్థి కోసం చూస్తున్న కాంగ్రెస్ కడియం కావ్యను అవకాశం కల్పించినట్లు సమాచారం.
BRS MP Candidates List 2024 : వరంగల్ జిల్లాలో ఒక్కొక్కరుగా కారు దిగుతున్న బీఆర్ఎస్ నేతలు అధినాయకత్వానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ హస్తం గూటికి చేరారు. పోను పోనంటూనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితిని వీడారు. తాజాగా కడియం శ్రీహరి సైతం అదే బాటలో పయనించడం ఓరుగల్లులో గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారనుంది.