KALESHWARAM PROJECT INVESTIGATION: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఈఈ తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు రూ. 1600కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లుగా ఇంజినీర్లు కమిషన్‌కు తెలిపారు. బ్యాంకు గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అని ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది. ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశం మినిట్స్‌ను అనుసరించకుండానే విడుదల చేసినట్లుగా ఇంజినీర్లు పేర్కొన్నారు.
ఆనకట్టల వద్ద డ్యామేజ్‌కు గల కారణాలను కమిషన్ ప్రశ్నించింది. అనుకున్న దానికంటే ఎక్కువ వరద రావడం వల్లే సీసీ బ్లాక్‌లు దెబ్బతిన్నట్లు ఇంజినీర్లు సమాధానం ఇచ్చారు. 2022లో అనుకున్న దాని కంటే ఎక్కువ వరద రావడం వల్లే సీసీ బ్లాక్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు కూడా కమిషన్‌ను ఇంజినీర్లు వివరించారు.
డిజైన్లు ఎవరు తయారు చేశారు?: డిజైన్లు, డ్రాయింగ్‌లు ఎవరు తయారు చేశారని ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించగా వ్యాప్కోస్ అనే సంస్థ తయారు చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. సీడీఓ సీఈ అనుమతితో అమలు చేసినట్లుగా స్పష్టం చేశారు. నిర్మాణానికి ముందు సైట్ల వద్ద ఏమైనా పరీక్షలు నిర్వహించారా అని కూడా కమిషన్ ప్రశ్నించగా ఎన్‌ఐటీ(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)వరంగల్ ఆధ్వర్యంలో పలు పరీక్షలు నిర్వహించినట్లు ఇంజినీర్లు కమిషన్‌కు వివరించారు.
కాళేశ్వరం ప్రజెక్ట్ గతేడాది ఎన్నికల సమయంలో భూమి లోపలికి కుంగి పోయింది. దీనిపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసి విచారణ జరుపుతోంది. అలాగే యాదాద్రి విద్యుత్తు ప్లాంటు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కూడా మొదట్లో ఎల్. నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విద్యుత్ కోనుగోళ్లకు సంబంధించిన అంశాలపై ప్రస్తుత చైర్మన్ జస్టిస్ జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ విచారణ జరుపుతున్నారు.
కొద్ది రోజుల క్రితం కమిషన్ సీరియస్: గతంలో కాళేశ్వరం గేట్లు మూసివేసే పరిస్థితి కూడా లేదని అధికారులు పేర్కొన్నారు. మూడు ఆనకట్టలకు సంబంధించిన నాణ్యత, నియంత్రణ గురించి క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ ముందు వారు భిన్న సమాధానాలు చెప్పారు. బ్యారేజీల సైట్ విజిట్లు రెండు, మూడు నెలలకోమారు అని కొందరు అసలు సైట్ విజిట్ చేయలేదని మరికొందరు సమాధానం ఇచ్చారు.