Justice PC Ghose Commission Inquiry on Kaleshwaram : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ పునాది ర్యాఫ్ట్ కింద ఇసుక కదలడంతోనే నష్టం జరిగి ఉంటుందని నీటిపారుదలశాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓ అండ్ ఎమ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బి. నాగేంద్రరావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ కమిషన్ ముందు ఈఎన్సీ నాగేందర్‌రావు, సీఈ అజయ్ కుమార్, ఇంజనీర్ ఓంకార్ సింగ్ హాజరయ్యారు. ఆనకట్టల నాణ్యత, నిర్వహణ, డ్యాం సేఫ్టీ నిబంధనల అమలు గురించి జస్టిస్ పీసీఘోష్ వారిని ప్రశ్నించారు.
కమిషన్ : 2022లో ఏడో బ్లాక్‌లో నీళ్లు వెళ్లే 17న మార్గం దిగువన లీకేజీలను నిర్మాణ సంస్థ గుర్తించింది కదా?
నాగేందర్‌రావు : గుత్తేదారు, రామగుండం ఈఎన్సీ మధ్య ఉత్తప్రత్యుత్తారాలు కొనసాగాయి. ఆ సమాచారం ఓ అండ్ ఎమ్‌కు తెలుపలేదు.
కమిషన్ : బ్యారేజీ లోపలి భాగంలో నీటిని తొలగిస్తేనే నిర్వహణ పనులు చేయడానికి వీలుంటుంది కదా, మరి ఈ విషయాన్ని బ్యారేజీల బాధ్యులకు ఎందుకు చెప్పలేదు?
నాగేందర్‌రావు : దీనిపై వీడియోకాన్ఫరెన్స్‌లో నోటిమాటగా చెప్పాను.
లిఖితపూర్వకంగా చెప్పాలి కదా అంటూ అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణను పర్యవేక్షిస్తున్న కీలక ఉన్నతాధికారి నాగేంద్రరావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం మూడు గంటలపాటు విచారణ చేసింది. 130పైగా ప్రశ్నలు అడగ్గా ఆయన పలు ప్రశ్నలకు తెలియదు, చెప్పలేను, గుర్తులేదు అని సమాధానాలు ఇచ్చారు.
కమిషన్ : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పూర్తయినట్లు భావిస్తున్నారా?
నాగేందర్‌రావు : అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు పూర్తయ్యాక ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కాకుండానే ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.
కమిషన్ : మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి ఎగువ, దిగువ ప్రాంతాల్లో, ర్యాఫ్ట్ కింద ఇసుక కదలడమే కారణమా?
నాగేందర్‌రావు : అవును
కమిషన్ : బ్యారేజీలు నీటి నిల్వ కోసం కాదు వచ్చే నీటిని దిగువకు వదులుతూనే కొద్దిగా ఉపయోగించుకోవడానికి నిర్మిస్తారు కదా?
నాగేందర్‌రావు : నిజమే
కమిషన్ : మరి అలాంటప్పుడు బ్యారేజీల్లో నిల్వ చేయాలని సూచించిన పైస్థాయి వారెవరు?
నాగేందర్‌రావు : ఉన్నతవర్గాల ఆదేశాల ప్రకారం జరిగింది
కమిషన్ : వరదల సమయంలో గేట్లు తెరవొద్దని ఎవరు ఆదేశించారు? మూడు బ్యారేజీల లోపాలు మీకు తెలుసా?
నాగేందర్‌రావు : రామగుండం ఈఎన్సీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదు.
కమిషన్ : మీరు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారా?
నాగేందర్‌రావు : 2021లో రెండు సార్లు పరిశీలించాం. రుతుపననాలకు ముందు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రాజెక్టు బాధ్యులకు నివేదిక ఇచ్చినా అమలు చేయలేదు. బ్యారేజీల్లో ఎక్కువ నిల్వ చేయడం, తక్కువ స్థాయిలో గేట్లు ఎత్తడం వల్ల షూటింగ్ వెలాసిటీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ కారణంతో సీసీ బ్లాక్స్, ఏప్రాన్ తదితర నిర్మాణాలు కొట్టుకుపోయాయి.
కమిషన్ : 2019, 2020ల్లో వరదలకు బ్యారేజీల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయి కదా?
నాగేందర్‌రావు : మూడు బ్యారేజీలు రామగుండం ఈఎన్సీ పరిధిలోనే ఉన్నాయి. ఆయన ఏనాడూ ఓ అండ్ ఎం విభాగానికి రిపోర్ట్ చేయలేదు.
కమిషన్ : మీరు ఎవరినో రక్షించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది?
నాగేందర్‌రావు : అలాంటిది ఏమీలేదు
కావొచ్చు, తెలియదు, చెప్పలేను - 91 ప్రశ్నలకూ ఇవే సమాధానాలు! - Justice PC Ghose Enquiry
కనీస అధారాలు లేకుండా ఎలా? : అఫిడవిట్‌లో కనీస ఆధారాలు లేకుండా ఎలా అంశాలను పేర్కొంటారని క్వాలిటీ కంట్రోల్ విశ్రాంత సీఈ అజయ్‌కుమార్‌పై జస్టిస్ పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు బ్యారేజీలను సందర్శించారని అడగ్గా ప్రమాదం జరగక ముందు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించానని, సుందిళ్ల బ్యారేజీని పరిశీలించలేదని సమాధానమిచ్చారు. ఎందుకు పరిశీలించలేదని కమిషన్ ప్రశ్నించగా, నిర్మాణ పనులపై రిపోర్టులు రాకపోవడంతో వెళ్లలేదని తెలిపారు.
బ్యారేజీల వద్ద ఉండే రిజిస్టర్‌లో సంతకాలు చేశారా అని కమిషన్ అడిగింది. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల్లో ఈఈగా పనిచేసి పదవీ విరమణ పొందిన సర్దార్ ఓంకార్ సింగ్‌ను కూడా కమిషన్ విచారించింది. వరదలకు సుందిళ్ల బ్యారేజీ వద్ద ఏర్పడిన డ్యామేజీని నిర్మాణ సంస్థ సరిచేయకపోవడంపై ఏం చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు నిర్మాణ సంస్థకు నోటీసు ఇచ్చామని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉందన్న విషయాన్ని చెప్పగా వారు అంగీకరించారని వివరించారు. నిర్మాణం సందర్భంగా మీకు సూచనలు చేసిన పై అథారిటీ ఎవరని అడగ్గా ఎస్‌ఈ ఉన్నారని, సీఈగా నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేసేవారని సింగ్ తెలిపారు.
కాళేశ్వరం డిజైన్లను ఎవరు తయారు చేశారు? : జస్టిస్ పీసీ ఘోష్ - kaleshwaram commission Investigate