Judas Protest in Telangana : సమస్యల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. స్టైఫండ్ విడుదలకు గ్రీన్‌ఛానల్ ఏర్పాటు సహా ఆస్పత్రులలో మౌలికవసతులు కల్పించాలనే 8 డిమాండ్లతో జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఓపీ, ఎలక్టివ్ సేవల్ని బహిష్కరించారు. హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల, సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో నిరసన తెలిపిన జూడాలు, 6నెలలుగా స్టైఫండ్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరేళ్లుగా ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నా, పాలకులు పట్టించుకోవట్లేదని జూడాలు ఆరోపించారు. పెరుగుతున్న వైద్య విద్యార్థుల సీట్లకు అనుగుణంగా హాస్టళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందని జూనియర్ వైద్యులు తెలిపారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ ఓపీ సేవలు బహిష్కరించిన జూడాలు, సమస్యలు పరిష్కరించకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ మెడికల్ కళాశాలలో రోడ్లు అధ్వానంగా తయారై ప్రమాదాల బారిన పడుతున్నామని వెల్లడించారు. మరోవైపు నిజామాబాద్, నల్గొండలోనూ ప్రభుత్వ ఆస్పత్రుల ముందు జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ దిశగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేపట్టిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల నుంచి సుమారు పదిమంది జూడాలు మధ్యాహ్నం మంత్రిని కలిసి చర్చించారు. ఎనిమిది డిమాండ్‌లలో జూడాలకు హాస్టల్ భవనాల నిర్మాణం, కేఎంసీలో రోడ్లు మెరుగు పరచటం సహా సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంపు వంటి అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మిగతా అంశాలపై ఇంకా స్పష్టత రాలేదని జూనియర్ వైద్యులు వెల్లడించారు. సమ్మె యధాతథంగా కొనసాగుతుందనీ, తదుపరి కార్యాచరణపై రాష్ట్రస్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
"స్టైఫండ్ విడుదలకు గ్రీన్‌ఛానల్ ఏర్పాటు సహా ఆస్పత్రులలో మౌలికవసతులు కల్పించాలి. ఆరేళ్లుగా ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నా, పాలకులు పట్టించుకోవట్లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించిన సమస్యలను పరిష్కరించాలి". - జూనియర్ డాక్టర్లు