Jharkhand MLAs Camp in Hyderabad : హైదరాబాద్‌లోని శామీర్‌పేట లియోనియా రీసార్ట్స్ శిబిరంలో ఉన్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇవాళ రాంచీకి వెళ్లనున్నారు. రేపు ఝార్ఖండ్ శాసన సభలో స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేలు హాజరై, బల నిరూపణ చేయాల్సి ఉంది. దీంతో ఇవాళ మధ్యాహ్నం భోజనం తర్వాత ఝార్ఖండ్‌కు వెళతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ చేయాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల కుదరలేదని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.
Jharkhand MLAs going to Ranchi Today : కాంగ్రెస్, జేఎంఎం పార్టీలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలు మూడు రోజులుగా హైదరాబాద్ శిబిరంలో ఉన్నారు. వారు ఉంటున్న రీసార్ట్స్ వద్ద ఎవరినీ లోనికి వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే రిసార్ట్స్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, మల్‌రెడ్డి రామిరెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.
కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్ బరిలో ఆ అభ్యర్థి!
Jharkhand MLAs Camp in Hyderabad : ఝార్ఖండ్ (Jharkhand) నూతన సీఎంగా చంపయీ సోరెన్ (Champai Soren) ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ బలపరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం (JMM) చర్యలు చేపట్టింది. 81 మంది సభ్యుల ఝార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
ఝార్ఖండ్ శాసన సభలో 81 మంది ఎమ్మెల్యేలకు గానూ 41 మంది మెజార్టీ ఉంటే వారిదే అధికారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేఎంఎం మూడింటికి కూడా తగినంత మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్న జేఎంఎం పార్టీతో 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
దీంతో ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (Hemant Soren) కొనసాగుతూ వచ్చారు. అయితే ఆయనపై భూకుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ముఖ్యమంత్రి హోదాలో తనపై కేసు నమోదు కావడంతో ఆయన రాజీనామా చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఝార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
Jharkhand Political Crisis Latest Updates : ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైన కూడా కొన్ని గంటల పాటు సందిగ్ధం నెలకొంది. చివరకు చంపయీ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం అర్ధరాత్రి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నుంచి నిర్ణయం వెలువడింది. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం చంపయీ సోరెన్ (Champai Soren)తో గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు.
చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం తర్వాత శాసనసభ్యుల బలం నిరూపించేందుకు గవర్నర్ పది రోజులు గడువు ఇచ్చారు. దీంతో జేఎంఎం, కాంగ్రెస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ఎక్కడ తమవైపు తిప్పుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కడ కూలదోస్తుందో అన్న అనుమానంతో వారిని కాపాడుకునేందకు హైదరాబాద్‌కు పంపించారు.