Six Maoist Encounter in Telangana : అబూఝ్‌మాడ్ అడవుల్లో నిర్బంధం పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారీ మావోయిస్టుల ఎత్తుగడలను చిత్తు చేస్తున్నాయి పోలీస్ బలగాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో గురువారం నాటి ఎన్‌కౌంటర్‌లో ఏకంగా ఆరుగురు మావోయిస్టులు మరణించడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది.
తెలంగాణ ఆవిర్భవించాక ఒకే ఎన్‌కౌంటర్‌లో ఇంతమంది మృతి చెందడం ఇదే తొలిసారి. ఈ ఎన్‌కౌంటర్‌తో 12 మంది సభ్యులు గల బీకే-ఏఎస్‌ఆర్ (భద్రాద్రి కొత్తగూడెం - అల్లూరి సీతారామరాజు) డివిజన్ కమిటీ లేకుండా పోయింది. ఎదురుకాల్పుల నుంచి మాసయ్య అనే సభ్యుడు తప్పించుకోగా, ఇదే కమిటీ సభ్యుడు అశోక్ అలియాస్ విజేందర్ గత జులైలో ఇదే జిల్లా దామెరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.
ఇటీవలే మరో ముగ్గురిని పోలీసులు చర్లలో అరెస్ట్ చేశారు. ఘటనా స్థలిలో లేకపోవడంతో కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ మాత్రమే మిగిలారు. గత మే నుంచి లచ్చన్న బృందం దామెరతోగు, కరకగూడెం, గుండాల, తాడ్వాయి అడవుల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
పక్కా ప్లాన్ ప్రకారమే : ఛత్తీస్‌గఢ్‌కు తిరిగి వెళ్లేందుకు మావోయిస్టులు ప్రయత్నించినా గోదావరి నది ఉద్ధృతి కారణంగా సాధ్యం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్లాన్ చేసి, గోదావరి నదిని దాటే ఫెర్రీ పాయింట్ల వద్ద పోలీసులు నిఘా ఉంచడంతో పాటు కూంబింగ్ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి వచ్చింది.
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ - ఆరుగురు మావోయిస్టులు హతం - 6 MAOISTS KILLED IN TELANGANA TODAY
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో పాగా వేసే మావోయిస్టుల ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. 2015 సెప్టెంబరు 15న ములుగు వెంగళాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హనుమకొండ వడ్డేపల్లికి చెందిన ఎంటెక్ విద్యార్థి శ్రుతి అలియాస్ మహిత, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సాగర్ మరణించారు.
- 2020లో రాష్ట్రంలో పాగా వేసేందుకు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ బృందం ఆసిఫాబాద్ అడవుల్లో ఆరు నెలలపాటు తిరిగింది. ఈక్రమంలో అయిదారు ఎన్‌కౌంటర్లు జరగ్గా భాస్కర్ త్రుటిలో తప్పించుకున్నారు. సెప్టెంబరు 20న అక్కడి కదంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మూడు రోజులకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అడవుల్లో ముగ్గురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
- 2020 అక్టోబరులో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బీఆర్ఎస్ కార్యకర్త భీమేశ్వరరావును ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు చంపేశారు. వారం రోజులకే సమీపంలోని మంగపేట అడవుల్లో ఇద్దరు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లో పోలీసులు మట్టుబెట్టారు. 2020లో డీకేఎస్‌జడ్‌సీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న 2021 జూన్‌లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అనారోగ్యంతో మరణించడం పార్టీకి అశనిపాతంలా మారింది. 2021 అక్టోబరులో ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 51 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా 302 మంది లొంగిపోయారు. మృతుల్లో 28 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లావారే ఉన్నారు. 10 మంది ములుగు, 5మంది ఖమ్మం, ఇద్దరు ఆసిఫాబాద్, మరో ఇద్దరు వరంగల్ గ్రామీణం, ఆదిలాబాద్, హైదరాబాద్, నల్గొండ, వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి ఒక్కొక్కరున్నారు. ఎన్‌కౌంటర్ల సందర్భంగా మావోయిస్టులకు చెందిన 136 ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.