Instagram Saved Son in Wanaparthy : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఓ ప్రభంజనమేనని చెప్పాలి. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతి విషయాన్ని అరచేతిలోనే చూపిస్తూ ఎందరికో విజ్ఞానాన్ని అందిస్తోంది. మరెందరికో డబ్బులను సంపాదించి పెడుతోంది. అందుకే యువత సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అయితే ఈ సామాజిక మాధ్యమాల వల్ల కొందరి జీవితాలు నాశనం అవుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇదే సోషల్ మీడియా తప్పిపోయిన బిడ్డను కన్నవారి చెంతకు చేర్చి ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. రెండేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసి కన్నవారు, తోబుట్టువులు గుర్తుపట్టారు. తర్వాత పోలీసులు వారికి తమ కుమారుడిని అప్పగించారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శంషాబాద్‌కు చెందిన రాములు అనే వ్యక్తికి కుమారుడు చరణ్, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడికి చిన్నప్పటి నుంచి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంటి వద్దే ఉండేవాడు. రెండేళ్ల క్రితం రాములు ఇళ్లు కూలిపోవడంతో పక్కనే ఉన్న బంధువుల ఇంటికి సామగ్రి తరలించే క్రమంలో చరణ్ కనిపించకుండాపోయాడు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి (రెండేళ్లుగా) తండ్రి తన కుమారుడి ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నాడు.
చరణ్ పేరుతో ఇన్స్టాగ్రామ్ ఐడీ : ఈ క్రమంలో చరణ్ రెండేళ్లుగా ఎక్కడెక్కడో తిరుగుతూ, వారం రోజుల క్రితం వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరాడు. ఇక్కడే ఉన్న స్థానిక యువకులు విష్ణువర్ధన్, రఘు, శ్రీకాంత్‌తో చరణ్‌కు పరిచయం ఏర్పడింది. పట్టణంలో ఎక్కడ శుభకార్యాలు జరిగినా చరణ్ అక్కడకు వెళ్లి నృత్యాలు చేస్తుండేవాడు. ఇది గమనించిన ఆ యువకులు చరణ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. చరణ్ చేసిన అన్ని నృత్యాలను వీడియో తీసి, వారు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసేవారు. ఇలా చరణ్ డాన్స్ వీడియోలు చాలా మంది చూసేవారు.
ఈ క్రమంలో ఒకసారి చరణ్ కుటుంబసభ్యులు సైతం ఆ వీడియోలు చూశారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తండ్రి, ఇద్దరు అక్కలు ఆ తర్వాత ఎంతో ఆనందపడ్డారు. తన బిడ్డ దొరికాడని తండ్రి, తమ్ముడు దొరికాడని తోబుట్టువులు ఎంతో సంతోషించారు. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడీ వివరాలు తెలుసుకుని ఆ యువకులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే వీడియో కాల్ చేసి తండ్రి రాములు, అక్కలు చరణ్‌ను గుర్తుపట్టారు. దీంతో యువకులు కొత్తకోట పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న రాములుకు చరణ్‌ను అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు. యువకుడిని కన్నవారి చెంతకు చేర్చిన యువకులను ఎస్సై అభినందించారు. చరణ్ తండ్రి, అక్కలు, బావలు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.
డీమార్ట్కెళ్లాడు, చాక్లెట్స్ తిన్నాడు, అరెస్ట్ అయ్యాడు - కారణం 'వైరల్'