Polio Victim Underwent a Heart Transplant at Kamineni Hospital : భారతదేశలోనే మొట్టమొదటిసారిగా ఒక పోలియో బాధితుడికి ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏళ్ల భాస్కర్ వృత్తిపరంగా టైలర్. అతడు తీవ్రమైన గుండెవ్యాధితో బాధపడుతున్నాడు. గత మూడేళ్లుగా అతడి పాక్షిక పోలియో కారణంగా పరిస్థితి మరింత విషమించింది.
దాంతో ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి రాగా, ఇక్కడి గుండెమార్పిడి విభాగాధిపతి, కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ విశాల్ వి. ఖంటే, కన్సల్టెంట్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రాజేశ్ తదితరులతో కూడిన వైద్య బృందం ఈ అసాధారణ శస్త్రచికిత్సను విజయవంతం చేసింది. ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాల సామర్థ్యాన్ని ఇది నిరూపించింది.
జీవన్ దాన్ సహకారంతో భాస్కర్‌కు పునర్జన్మ : భాస్కర్ గుండె సరిగా పనిచేయకపోవటంతో రక్తం తగినంత సరఫరా కావటం లేదని గుర్తించిన వైద్యులు, అతడికి గుండె మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. జీవన్ దాన్‌లో రిజిస్టర్ చేయగా, ఇటీవల ఓ జీవన్మృతుడి నుంచి సేకరించిన గుండెను జీవన్ దాన్ సహకారంతో భాస్కర్‌కు అమర్చారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి భాస్కర్‌కు శస్త్రచికిత్స పూర్తి చేసినట్టు వైద్యులు ప్రకటించారు. ఆపరేషన్ చేసి దాదాపు మూడు నెలలు కావస్తుండగా ప్రస్తుతం భాస్కర్ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు.
"శస్త్రచికిత్స విజయవంతం కావడంతో భాస్కర్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడి రోజువారీ కార్యకలాపాలు క్రమంగా చేసుకోగలుగుతున్నాడు. గతంలో తీవ్రమైన అలసట కారణంగా మంచానికే పరిమితమైన అతడు ఇప్పుడు కాస్త దూరాలు నడవగలుగుతున్నాడు. సాధారణ జీవితంలోకి తిరిగి అడుగు పెడతాడు. అయితే, శస్త్రచికిత్స అనంతరం భాస్కర్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది, కొత్త హార్ట్‌ను శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు మందులు వాడుతుండాలి. అతడి పరిస్థితిని మా బృందం నిరంతరం పరిశీలిస్తోంది."-విశాల్ వి. ఖంటే, కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్
Kamineni Hospital Successful Heart Transplant Treatment : ఈ సందర్భంగా కామినేని ఆసుపత్రుల సీఓఓ డాక్టర్ గాయత్రీ కామినేని మాట్లాడుతూ, ఇప్పటివరకు కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలకు పెట్టింది పేరైన కామినేని ఆస్పత్రిలో ఇప్పుడు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు కూడా చేయడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందన్నారు. ఈ శస్త్రచికిత్స విజయం తమ వైద్య సామర్థ్యాలను సగర్వంగా ప్రదర్శిస్తుందన్నారు.
ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్లు డాక్టర్ విశాల్ ఖాంటే, డాక్టర్ రాజేశ్ దేశ్‌ముక్, చీఫ్ కార్డియాక్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ సురేశ్‌కుమార్ ఎసంపల్లి, కన్సల్టెంట్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ రవళి సాడే, సుశిక్షితులైన ఐసీయూ సిబ్బంది అందరూ ఇందులో చాలా కీలక పాత్రలు పోషించారని తెలిపారు. కామినేని ఆసుపత్రిలో అత్యంత నిపుణులైన వైద్యులు తనకు ఒక సరికొత్త జీవితాన్ని అందించారని భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. వాళ్ల నైపుణ్యం, నిబద్ధత లేకపోతే తాను ఈ కష్టం నుంచి కోలుకునేవాడిని కానన్నారు. వైద్యులు సూచించిన మందులు కచ్చితంగా వాడుతూ, ఎప్పటికప్పుడు వచ్చి చూపించుకుంటానని చెప్పారు.
కూకట్‌పల్లిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం - rare surgery in Kukatpally
అమ్మ బాబోయ్!! కిడ్నీలో ఏకంగా 418 రాళ్లు - రెండు గంటలు శ్రమపడి తొలగించిన డాక్టర్లు