Heavy Rains For Three Days in Telangana : ఇవాళ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల మూడు రోజులు కూడా చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడనంగా ఏర్పడిందని ఐఎండీ సంచాలకులు తెలిపారు.
దీనికి అనుబంధ ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఇంకా ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశకు వంగి ఉందని ఐఎండీ సంచాలకులు పేర్కొన్నారు. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తరువాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే మూడు రోజులలో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
ఆయా జిల్లాలకు భారీ వర్షాలకు : మరో వైపు ఈ నెల 9న కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే భారీవర్షాలకు వరదలు వచ్చి పలు ప్రాంతాలు అతలాకుతలమైన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలుగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు ఉన్నచోట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటిప్పుడు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రకృతి విపత్తులు గురించి ప్రజలకు ఎప్పటిప్పుడు సూచిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పరిస్థితుల ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
హైదరాబాద్లో మరోసారి భారీవర్షం - పలుచోట్ల ట్రాఫిక్ జామ్ - Heavy rains in Telangana
రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - ఆ రెండు తేదీల్లో మాత్రం జర జాగ్రత్త! - Heavy Rain Alert to Telangana