HYDRA Start Work to Convert Sewage-Filled Ponds Into Fresh Water Sources : హైదరాబాద్‌లోని చెరువులకు మహర్దశ పట్టనుంది. సహజ పద్ధతుల్లోనే మురుగుతో నిండిన చెరువులను మంచినీటి జలవనరులుగా తీర్చిదిద్దేందుకు హైడ్రా త్వరలో పనులు మొదలుపెట్టనుంది. బెంగళూరులో కలుషిత నీటితో కాలుష్య కాసారంలా మారిన తటాకాలు, ఆక్రమణలతో కనుమరుగైన చెరువులకు అక్కడి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మంచినీటి జలవనరులుగా మార్చేందుకు నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆనంగద్ మల్లిగవాడ్ అనే వ్యక్తి తన ఇంజినీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి చెరువులను కాపాడటమే లక్ష్యంగా 2017 నుంచి 35 తటాకాలకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితిని తీసుకువచ్చేందుకు హైడ్రా చర్యలు చేపట్టనుంది.
చెరువుల వద్ద కోట్ల రూపాయలు వెచ్చించి మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, చుట్టూ కాలిబాటల అభివృద్ధికి రూ.కోట్లలో వెచ్చిస్తున్నారు. దుర్గం చెరువు అభివృద్ధికి ఓ కార్పొరేట్ సంస్థతో రూ.60కోట్లకుపైగా జీహెచ్‌ఎంసీ ఖర్చు చేయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరులో నామమాత్రపు ఖర్చుతో జలవనరులు మెరుగుపడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.
- చెరువులకు వరద నీటితోపాటు, మురుగునీటి నాలాలు ఉంటాయి. విస్తీర్ణం ఆధారంగా ఆయా చెరువులను ఆనంద్ పూర్తిగా తవ్వేవారు. పూడిక తొలగిస్తారు, క్రమపద్ధతిలో చెరువు అడుగు భాగాన్ని చదును చేస్తారు, చుట్టూ కట్ట నిర్మించడం మొదటి దశలో చేస్తారు.
- కట్ట నిర్మాణం పూర్తయ్యాక చెరువు మధ్యలో మరో కట్ట నిర్మించి ఓ వైపున వరదనీరు, మరోవైపు మురుగునీరు నిల్వ ఉండేలా ఏర్పాటు చేస్తారు. చెరువులోకి మురుగు వ్యర్థాలను తీసుకొచ్చే అన్ని పైపులైన్లను ఓ ప్రాంతంలో లింక్ చేస్తారు. ఆ ప్రాంతం తటాకం కంటే ఎత్తులో ఉంటుంది. ఆ క్రమంలో మరో మూడు వడపోత కుంటలను ఏర్పాటు చేస్తారు. మొదటి కుంటలో చెట్లు, రెండో కుంటలో పెద్ద రాళ్లు ఉంచుతారు, మూడో కుంటలో కంకర, ఇసుక మిశ్రమాన్ని భారీగా పోస్తారు. దీంతో మురుగునీరు చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తూ రాళ్లు, కంకర, ఇసుక, వేర్వేరు మొక్కలను దాటుకుంటూ వెళ్లిన నీరు పరిశుభ్రంగా మారుతుంది.
- అదే పద్ధతిలో మొదటి ఫేస్ కింద మాదాపూర్ సున్నం చెరువు, గగన్‌పహాడ్ అప్పా చెరువు, ప్రగతినగర్ ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.