HYDRA Focuses on The Restoration of Ponds : సహజ సిద్ధంగా ఏర్పడ్డ చెరువులను రేపటి తరానికి, అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలి. ఆక్రమణలకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని సరస్సుల్లా మార్చాలి. ఈ లక్ష్యాలతో కొత్త తరహాలో జలవనరులకు పునరుజ్జీవం కల్పించేందుకు హైడ్రా కసరత్తులు ప్రారంభించింది. 'చెరువులు ఎందుకు?' అనే చిన్న ప్రశ్నతో చర్చను ప్రారంభించింది. నీటి పారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పరిశోధన, నిపుణులతో కమిషనర్ ఏ.వి.రంగనాథ్ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు.
అప్పట్లో చెరువులే వేరు : 50 ఏళ్ల క్రితం నగరంలోని అనేక చెరువులు వ్యవసాయానికి ఉపయోగపడేవి. సిటీగా మార్చడంతో పొలాలన్నీ కాలనీలయ్యాయి. హయత్‌నగర్, గౌరెల్లి, ప్రతాపసింగారం, తూంకుంట, నార్సింగి వంటి కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలు కనిపిస్తున్నప్పటికీ అవి బోరు బావులపై ఆధారపడినవి. నగర జనాభా రోజురోజుకూ పెరగడంతో చెరువులు మురుగు కూపాలుగా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిండుగా మురుగునీటిని నిల్వ చేయడం అవసరమా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.
కూల్చివేతలే కాదు ఇక నుంచి రైట్ రైట్ కూడా - హైదరాబాద్ ట్రాఫిక్‌పై హైడ్రా ఫోకస్
చేయాల్సింది ఇది : ఉదాహరణకు ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిని స్వల్పంగా వాలు ఉండేట్టు చదును చేయాలి. బండరాళ్లు, గుట్టలున్న చోట దీవులను నిర్మించాలి. చెరువులోకి వచ్చే మురుగు నీటిని వలయం లాంటి నాలాలోకి పంపించి ఎస్టీపీలో క్లీన్ చేయాలి. లేకపోతే బెంగళూరులో మాదిరి వేర్వేరు దశల్లో వడపోత వ్యవస్థను ఏర్పాటు చేసి శుద్ధి చేయొచ్చు. అలుగు అంచు వరకు నిల్వ చేయాల్సిన అవసరమే లేదు. అలా చేస్తే తటాకం ప్రాణం పోసుకుంటుందని ఇటీవల జరిగిన సమావేశంలో నిపుణులు చర్చించారు. భారీ వర్షాలతో వరద ఉద్ధృతితో నాలాలు నిండిపోతున్నాయి. కీలక మలుపుల వద్ద ఆక్రమణలను తొలగించి, అవసరమైన చోట లోతును పెంచడం వంటి చర్యలతో నాలాల్లో ప్రవాహాన్ని నియంత్రించవచ్చని హైడ్రా అధికారులు భావిస్తున్నారు.
సీఎం మాటకు హైడ్రా కట్టుబడి ఉంటుంది : హైడ్రా విషయంలో నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చట్టబద్దమైన అన్ని అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఎలాంటి భయం అక్కర్లేదని తెలిపారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సద్భావన యాత్రలో మాట్లాడుతూ హైడ్రా విషయాన్ని ప్రస్తావించారు. చెల్లుబాటు అయ్యే అన్ని అనుమతులున్న నిర్మాణాల జోలికి వెళ్లమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని, ఆ ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని రంగనాథ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీఎం ప్రసంగం వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ చెరువుల సమీపంలో అన్ని అనుమతులున్న నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందని, అదంతా అవాస్తవమని హైడ్రా కమిషనర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
ఇకపై హైడ్రా ఫోకస్ అంతా వారిపైనే - లిస్ట్ కూడా రెడీ! అంతా పెద్దపెద్దొళ్లే!!
హైడ్రా నుంచి అద్దిరిపోయే న్యూస్! - కూల్చివేత బాధితులకు డబ్బులు - అలా చేస్తారట!