HYDRA Focus on Beautification of Main Ponds in Hyderabad : హైదరాబాద్‌లో కీలకమైన 100 చెరువుల్లో ఆక్రమణలు తొలగించి, సుందరీకరణ చేసి పర్యాటక ప్రదేశాలుగా మార్చాలని హైడ్రా నిర్ణయించింది. వీటి జాబితాను రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌కు ఇచ్చారు. దీనికి అనుగుణంగా కొన్ని చెరువులను సీఎస్‌ఆర్ పథకం కింద, మరికొన్ని హెచ్‌ఎండీఏ సొంత నిధులతో సుందరీకరణకు కార్యాచరణ రూపొందించారు. ఆక్రమణలు, పూడిక తొలగించిన తర్వాత వచ్చే మట్టి, శిథిలాలు ఎక్కడ వేయాలనే దానిపై అధికారులు యోచిస్తున్నారు. దీనికోసం చెరువుల వారీగా డ్రోన్‌తో సర్వే చేస్తున్నారు. సమీపంలో ఎక్కడ క్వారీ గుంతలు, పల్లపు ప్రాంతాలు ఉన్నాయి? శిథిలాలు వేయడానికి ఎక్కడ అనువుగా ఉంటుందో డ్రోన్‌తో వెతుకుతున్నారు.
మహా నగరంలో బల్దియా ఆధ్వర్యంలో 185, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 3500 చెరువులున్నాయి. చాలా ఏళ్లు వీటిని పట్టించుకోకపోవడంతో చాలా వరకు ఆక్రమించారు. ఈ నేపథ్యంలో హైడ్రా రంగ ప్రవేశం చేసింది. హైదరాబాద్‌లోని మొత్తం చెరువులను ఇటీవల సర్వే చేసింది. కీలకమైన వంద చెరువులను గుర్తించింది. వాటిలో పూర్తిగా ఆక్రమణలు తొలగించడంతో పాటు సుందరీకరణ చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని యోచిస్తున్నారు. వీటికి సమీపంలోని వరద నాలాలను అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
ఆ సమస్యలపై హైడ్రా ఫోకస్, లిస్టులో మొదటగా అదే - వీధివ్యాపారులు జర భద్రం!
బెంగళూరు నిపుణులతో చర్చలు : ముందుగా వేటిని బాగు చేయాలో చెప్పాలని ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కోరడంతో ఆయనకు హైడ్రా అధికారులు దానికి సంబంధించిన జాబితాను ఇచ్చారు. పూడికతీతతో పాటు చుట్టూ పచ్చదనం పెంచి పర్యాటక ప్రాంతాలుగా మార్చాలని హైడ్రా ఆయన్ను కోరింది. బెంగళూరు తరహాలో చెరువులకు పునరుజ్జీవం పోయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఎలా చేశారో అధ్యయనం చేయడానికి దీపావళి తర్వాత హైడ్రా, ఇతర శాఖల ఆధ్వర్యంలో అధికారుల బృందం అక్కడికి వెళ్లనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అక్కడికి వెళ్లి, ఆ రాష్ట్రంలోని నిపుణులతో చర్చించాలని నిర్ణయించారు.
రియల్ ఎస్టేట్‌కు మాత్రం వద్దు : సీఎస్‌ఆర్ కింద కొన్ని చెరువులను అభివృద్ధి చేయడానికి పలు సంస్థలు ముందడుగు వేశాయి. గతంలో 20 చెరువులను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించగా కొందరు ఏకంగా ఎఫ్‌టీఎల్ హద్దులను మార్చేసినట్లు హైడ్రా పరిశీలనలో వెల్లడైంది. మరికొందరు ఏకంగా చెరువులోనే నిర్మాణాలు చేశారని తేలింది. దీంతో ఈసారి రియల్ సంస్థలకు కాకుండా జాతీయ బ్యాంకులు, ఇతర నిర్మాణేతర సంస్థలకు మాత్రమే చెరువుల అభివృద్ధి పనులను అప్పగిస్తే బాగుంటుందని హైడ్రా హెచ్‌ఎండీఏ, బల్దియా ఉన్నతాధికారులకు సూచించింది.
ఈసారి చెట్లపై 'హైడ్రా' ఫోకస్ - ఇక హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ సమస్యకు చెక్?
మళ్లీ జేసీబీలకు పనిచెప్పిన హైడ్రా - ఈసారి రూట్ మార్చిందిగా!