Hydra Demolition On Gaganpahad Illegal Construction : రాష్ట్ర రాజధానిలో ఆక్రమణదారులపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. హైడ్రాకు అందిన ఫిర్యాదులను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ నియోజవర్గం గగన్‌పహాడ్ గ్రామంలో ఉన్న అప్ప చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ షెడ్లను నేలకూల్చింది. ఉదయం 7గంటలకే గగన్‌పహాడ్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న హైడ్రా సిబ్బంది అప్ప చెరువు ఎఫ్టీఎల్ పరిధిని చుట్టుముట్టింది. 50మంది సిబ్బంది, రెండు భారీ ఇటాచీలతో అక్కడి షెడ్లపై విరుచుకుపడింది.
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది. అక్కడి షెడ్లలో పనిచేసే కార్మికులను, వారి కుటుంబాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాసాలను ఖాళీ చేయాలని మైక్‌లో ప్రచారం చేశారు. ఆక్రమిత ప్రదేశాల్లో ఉన్న షెడ్లలోని సామాగ్రిని తక్షణమే తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా షెడ్లను తొలగించారు.
వస్తువులు ఉండగానే కూల్చివేతలు : కొంతమంది యజమానులు షెడ్లలోని సామాగ్రిని డీసీఎంల్లో తరలించగా మరికొంతమందికి సమాచారం లేకపోవడంతో లక్షల రూపాయల సరుకు ఉండగానే వాటిని నేలమట్టం చేశారు. షెడ్లలో పనిచేస్తున్న బిహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులు కట్టుబట్టలతో అక్కడి నుంచి బయటపడ్డారు. షెడ్లను కూల్చిన తర్వాత వచ్చిన యజమానులు శిథిలాల మధ్య చిక్కుకుపోయిన విలువైన ఫైల్స్, నగదును వెతికి తీసుకోవడం కనిపించింది.
అప్ప చెరువుకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ప్రకారం 40 ఎకరాల ఎఫ్టీఎల్ ఉంది. కాలక్రమేణా 8 ఎకరాలకు కుచించుకుపోయింది. దాదాపు 32 ఎకరాలు కబ్జాకోరల్లో చిక్కుకుంది. ఫలితంగా ఏటా భారీ వర్షాలు కురిసినప్పుడల్లా అప్ప చెరువు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. మైలార్‌దేవ్‌పల్లి భాజపా కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెరువు పరిధిలో 8 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూమి విక్రయించే క్రమంలో తప్పుడు సర్వే నంబర్లతో ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆ ఆక్రమిత భూముల్లో పెద్ద ఎత్తున షెడ్లను నిర్మించి పరిశ్రమలకు, గోదాములకు లీజుకు ఇచ్చారని తెలుస్తోంది.
శ్రీనివాస్ రెడ్డి కుటుంబం రాగి, ఇత్తడి వస్తువులను తయారీ పరిశ్రమ నిర్వహిస్తోంది. ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిజనిర్ధారణ చేసుకుని అప్ప చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతం పెద్ద ఎత్తున అన్యక్రాంతమైందని, 13 భారీ షెడ్లు అనధికారికంగా నిర్మించారని గుర్తించారు. రంగనాథ్ ఆదేశాలతో తక్షణం గగన్ పహాడ్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న హైడ్రా సిబ్బంది బుల్డోజర్లతో కబ్జాల పాలైన షెడ్లను ఖతం చేశారు
ముందుగా సమాచారం ఇవ్వాల్సింది : హైడ్రా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షెడ్లను ఎలా కూల్చివేస్తుందని వాటిలో వ్యాపారం చేస్తున్న లీజుదారులు ప్రశ్నిస్తున్నారు. కొంత సమయం ఇస్తే కోట్లాది రూపాయల విలువైన తమ సామాగ్రిని, సరుకును తీసుకొని వాటిని ఖాళీ చేసి వెళ్లిపోయే వాళ్లమని వాపోయారు.
నిరాకరించిన బీజేపీ కార్పొరేటర్ : అప్ప చెరువులోని ఆక్రమణల కూల్చివేతలపై స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి స్పందించేందుకు నిరాకరించారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు హుటాహుటినా వారి షెడ్లకు చేరుకొని సిబ్బందితో అందులో ఉన్న సామాగ్రిని, యంత్రాలను బయటికి తరలించారు. మరోవైపు అప్ప చెరువుతో పాటు దాని పక్కనే ఉన్న మామిడికుంట, బ్రహ్మణకుంటలోనూ భారీగా ఆక్రమణలున్నట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. అందులో పలు పార్టీల చెందిన నాయకులు, వారి సన్నిహితులకు సంబంధించిన నిర్మాణాలున్నట్లు తెలుస్తోంది. వాటిపై కూడా హైడ్రా నిఘా పెట్టినట్లు సమాచారం.
జన్వాడ ఫాంహౌస్‌ను ఏ అనుమతులు తీసుకోకుండానే కట్టేశారు! - Hydra Focus on Janwada Farm House