HYDRA Calls For Tenders To Demolish Illegal structures : హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలను ఆక్రమించి అనధికారికంగా చేపడుతున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించబోతుంది. తమ వద్ద ఉన్న పరిమిత సిబ్బంది, యంత్రాలతో ఇప్పటికే 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. వంద ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాలను పరిరక్షించింది. అయితే పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులు, నగరంలో అన్యాక్రాంతమైన చెరువులు, నాలాలు, ఇతర ప్రభుత్వ స్థలాలు, పార్కుల్లోని నిర్మాణాలను కూల్చివేసేందుకు కాంట్రాక్టు పద్దతిలో ముందుకు వెళ్లాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతకు టెండర్లు ఆహ్వానం : కూల్చివేతలు, శిథిలాల తొలగింపు, అత్యాధునిక యంత్రాల సమకూర్చుకోవడం కోసం హైడ్రా టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 27 వరకు ఆఫ్ లైన్లో టెండర్లను ఆహ్వానిస్తూ బిడ్డర్లు తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్లో హైడ్రా కార్యాలయానికి సమర్పించాలని కోరారు. ఏడాది కాల పరిమితితో బిడ్స్‌ను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్న హైడ్రా టెండర్లలో పాల్గొనే బిడ్డర్లు, సంస్థలు తమ నియమ నిబంధనలు సూచనలను తప్పనిసరిగా పాటించాలని పలు షరతులు విధించారు. తమ ఆధీనంలో పనిచేసే సంస్థకు ఉండాల్సిన అర్హతలు, పరిమితులను వివరించారు.
ఇవీ నిబంధనలు : బిడ్డర్లు తప్పనిసరిగా యంత్రాలను కలిగి ఉండాలని, 20 మీటర్ల ఎత్తులో ఉన్న ఏ నిర్మాణాన్నైనా కూల్చే విధంగా హైరీచ్ హైడ్రాలిక్ యంత్రాలు ఉండాలని నిబంధన విధించారు. అంతేకాకుండా జా క్రషర్, షీర్ కట్టర్, అదనపు షీట్ కట్టర్, బకెట్, బ్లేడ్ జోడించిన రాక్ బ్రేకర్, రెండు ఎక్సావేటర్లు, 2 జేసీబీలు, 2 మినీ ఎక్సావేటర్లు, 2 రాక్ బేకర్లు ఉండాలని సూచించారు. ఓఆర్ఆర్ లోపలే వాటిని అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత బిడ్డర్లదేనని, కూల్చివేతకు 4 గంటల ముందే యంత్రాలను సమకూర్చాలని షరతు పెట్టారు. అలాగే బిడ్డర్లు తప్పనిసరిగా జీఎస్టీ, పాన్‌తోపాటు గత మూడు ఆర్థిక సంవత్సరాల ఐటీ రిటర్నులతో సహా చెల్లుబాటు అయ్యే చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌లను సమర్పించాలని, అదనంగా చార్టర్డ్ అకౌంటెంట్ తో ధ్రువీకరించిన బ్యాలెన్స్ షీట్, లాభ నష్టాల టర్నోవర్ సర్టిఫికేట్ వంటి అన్ని ఆర్థిక పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలన్నారు.
షరతులు వర్తిస్తాయి : బిడ్డర్ తప్పనిసరిగా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరానికి ధ్రువీకరించిన వార్షిక టర్నోవర్ నివేదికను అందించాలని, అది కనీసం రూ.2 కోట్ల టర్నోవర్ ఉండాలని హైడ్రా షరతులు విధించింది. బిడ్డర్ తప్పనిసరిగా కనీసం ఒక కూల్చివేత ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చేసి ఉండాలని, దాని విలువ కోటి రూపాయలైనా ఉండాలని సూచించారు. అందుకు సంబంధించిన తప్పనిసరిగా నోటరీ చేసిన వర్క్ ఆర్డర్, వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ కాపీలను సమర్పించాలని టెండర్ల ఆహ్వానంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు.
వారికి తొలి ప్రాధాన్యం : ఇంప్లోషన్ టెక్నిక్ ఉపయోగించి నిర్మాణాలను కూల్చివేయడంలో అనుభవం ఉన్న ఏ బిడ్డర్‌కైనా హైడ్రా ప్రాధాన్యత ఇస్తుందని, పొరుగున ఉన్న నిర్మాణాలకు నష్టం జరగకుండా పనిచేసే అనుభవం ఉన్న వారు, అందుకు అవసరమైన ఆధారాలు సమర్పించాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఐదు అంతకంటే ఎక్కువ అంతస్తులను హై-రీచ్ యంత్రంతో కూల్చివేతతో 5 గంటలలోపు పూర్తి చేసేలా ఉండాలన్నారు. బిడ్డర్ తప్పనిసరిగా సేఫ్టీ ఇంజనీరింగ్‌లో కనీసం 5 ఏళ్ల పని అనుభవం ఉన్న సేప్టీ ఇంజినీర్ ఉండాలన్నారు. బిడ్డర్ తమ ప్రతిపాదిత కూల్చివేత ఛార్జీలను సమర్పించాలని, అందులో ఇంధనం, రవాణా, ఆపరేటర్, నిర్వహణ, మరమ్మతులు మొదలైన వాటి ఖర్చులు ఉండాలన్నారు.
అన్ని యంత్రాల పనితీరును హైడ్రా భౌతికంగా తనిఖీ చేస్తుందన్నారు. రవాణా ఖర్చు, శిథిలాల తొలగింపు బాధ్యత బిడ్డర్లదేనన్న హైడ్రా కమిషనర్ వాహనాలు మరమ్మతులో ఉన్నప్పుడు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వాటికి పని గంటల ప్రకారమే చెల్లింపులు ఉంటాయన్నారు. పనితీరు సంతృప్తికరంగా లేకపోయినా హైడ్రాకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చినా కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తామని, సెక్యురిటీ డిపాజిట్లు కూడా జప్తు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమగ్రంగా వివరించారు.
వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు - సెప్టెంబరు 27 వరకు అవకాశం
సామాన్యుల్లోనూ 'హై'డ్రా గుబులు - నివాసాల కూల్చివేతలపై ఆందోళనలు - Hyderabad FTL And Buffer Zones