Racing At Hyderabad IT Corridor : నేటి కాలంలో ఆకతాయిలు ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో రకరకాల స్టంట్లు చేస్తున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు పక్కవారి ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. ఇలా పోకిరీలు రద్దీగా ఉండే రహదారులపై కార్లు, బైక్‌లతో హల్‌చల్ చేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రేసింగ్‌లు, స్టంట్లు చేస్తున్నారు. అధిక వేగంతో రయ్‌రయ్‌మంటూ చక్కర్లు కొడుతూ, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కొందరు పోకిరీలు ఇందుకు సంబంధించిన వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు చూసిచూడనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు.
Dangerous Stunts In Hyderabad : హైదరాబాద్‌లో వారంతాలు, అర్ధరాత్రి వేళ రాయదుర్గం టీహబ్ రోడ్లు, ఐటీ క్షేత్రంలోని రహదారులు బైకు రేస్‌లు, విన్యాసాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. హైదరాబాద్ నలమూలల నుంచి భారీగా బైకర్లు గుంపులుగా అక్కడికి చేరుకుంటారు. వాహనాలను మెరుపు వేగంతో డ్రైవ్ చేయడమే కాక విన్యాసాలూ చేస్తుంటారు. పోలీసుల నిఘా అంతంత మాత్రంగా ఉండడంతో ఆకతాయిల జోరుకు అడ్డుకట్ట పడడంలేదు.
రాయదుర్గం ఐటీ క్షేత్రంలో ముఖ్యంగా టీహబ్ రోడ్లలో బైక్ రేస్‌లను నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి జనసంచారం పూర్తిగా తగ్గిపోగానే బైకర్లకు పందేలు కాస్తుంటారు.అలా వారు వేగంగా నడిపే క్రమంలో అదుపు తప్పితే అక్కడి డివైడర్లు, ఫుట్‌పాత్‌లకు తగిలి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఒక్కోసారి ఇతరులకు నష్టం కలుగవచ్చు.
అంతంత మాత్రంగా పెట్రోలింగ్: టీహబ్ ఎదుట ఉన్న రోడ్డుపై అర కిలోమీటరు దూరం రేసులకు వాడుకుంటారు. అరబిందో గెలాక్సీ ముందున్న రోడ్డును, రెండు గుట్టల మధ్య నుంచి హైహోం భుజా వరకున్న రేస్‌లు సాగుతుంటాయి. ఆ రోడ్లు విశాలంగా ఉంటాయి. వారాంతాల్లో ఈ బైకు రేస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ అంతంత మాత్రంగా ఉండడంతో ఆకతాయిలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.
Live Video: రేసింగ్ చేస్తూ రెండు బైకులు ఢీ.. స్పాట్లోనే ఇద్దరు..
కేసులు నమోదు చేస్తాం : బైకు రేస్‌లను కట్టడి చేసేందుకు గస్తీని మరింత పటిష్ఠం చేస్తామని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. బైకర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తామని చెప్పారు. వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏకు అప్పగిస్తామని అన్నారు. మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రేస్‌లు నిర్వహించకుండా టీహబ్ రోడ్లపై నిర్ణీత దూరాల్లో టీఎస్‌ఐఐసీ ద్వారా వేగ నిరోధకాలు ఏర్పాటు చేస్తామని వెంకన్న వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తమ ప్రాణాలతో పాటు పక్కవారి జీవితాలతో చెలగాటం ఆడే ఆకతాయిలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై ఇలాంటివి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు.
నగరంలో బైక్ రేసింగులతో రెచ్చిపోతున్న యువత.. పలువురు అరెస్ట్..