Robberies At Hyderabad-Vijayawada National Highway : జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం ప్రయాణికుల్లాగే తిరుగుతూ పార్కింగ్ చేసిన వాహనాల్లోంచి డీజిల్ దొంగతనం చేయడం, రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి దోపిడీలకు పాల్పడుతున్నారు. రద్దీ లేని ప్రదేశాల్లో ఆగి ఉన్న వాహనదారులను డబ్బు, బంగారం కోసం బెదిరించడం, కాదని ఎదిరిస్తే ఏకంగా హత్య చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఇందుకు తాజాగా హైవేపై జరిగిన ఘటనలే నిదర్శనం. వరుస చోరీలు జరగడంతో నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచారు. దారి దోపిడీలపైన దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైవేలు వాహనం ఆపితే పాపం : గత నెల 18న ఏపీ నుంచి సరకును హైదరాబాద్‌లో దిగుమతి చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో అలసిపోయి కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం వద్ద పార్కింగ్ స్థలంలో ఆపిన మినీ డీసీఎం డ్రైవర్ హత్యకు గురయ్యాడు. దుండగులు అతని కాళ్లను కట్టేసి, గొంతు నులిమి దారుణంగా హత్య చేసి అవతలి వైపు రహదారి పక్కన పడేశారు. మే 19 తేదీన అదే ప్రాంతంలో ఆగి ఉన్న లారీ నుంచి 250 లీటర్ల డీజిల్‌ను దొంగతనం చేశారు. 23వ తేదీన కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద మరో దొంగతనం చేశారు. 25వ తేదీన మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో రూ.20 లక్షల విలువ చేసే ఇనుము దోచుకెళ్లారు. 28వ తేదీన నకిరేకల్ పటేల్ నగర్‌లో ఓ ఇంట్లో 8 తులాల బంగారం ఎత్తుకుపోయారు. వరస దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రహదారిపై పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.
"కొన్ని రోజులుగా రహదారిపై దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రయాణికులు భయపడుతున్నారు. ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులు దృష్టి సారించి పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను అరికట్టాలని కోరుకుంటున్నాం. జాతీయ రహదారిపై పోయేవారికి రక్షణ లేకుండాపోతోంది." - స్థానికులు
వాహనదారులను ఆపి మరీ దోపిడీ : ఈ నెల 3వ తేదీన అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఉన్న ఓ షోరూంలో దుండగులు రూ.3 లక్షల 77 వేలు దోచుకెళ్లారు. ఈ నెల 9న తెల్లవారుజామున ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా వాసులు ప్రయాణంలో అలసిపోయి చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సర్వీసు రోడ్డులో కారు ఆపారు. అందులో నిద్రిస్తున్న వారిపై ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి దాడి చేశారు. ప్రయాణికుల దగ్గర ఉన్న సుమారు 10 తులాల మేర బంగారాన్ని అపహరించారు.
జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితులు ఉపయోగించిన బైకులు, దోపిడీలు చేసే విధానం ప్రకారం ఒక అంచనాకి వచ్చారు. దొంగతనాల్లో ఆరితేరిన ముఠా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలు చేస్తున్నట్లు నిర్ణయానికి వచ్చారు. దారి దోపిడీలు, దొంగతనాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.
"మేము దర్యాప్తును ముమ్మరం చేశాం. ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాం. అన్ని రహదారుల్లో ఇలాంటి దొంగతనాలే చేస్తున్నారు. టోల్‌గేట్లకు దగ్గర్లోనే దోపిడీలు చేస్తున్నారు. ఈ దోపిడీలన్నీ ఎన్నికల సమయంలో జరిగాయి. ఎన్నికల కోడ్ సమయంలో పోలీసులు బిజీగా ఉంటారని తెలిసి దోపిడీలు చేశారు. పోలీసులందరూ గ్రూపులుగా విడిపోయి ఆధారాలు సేకరిస్తున్నాం." - చందనా దీప్తి, నల్గొండ ఎస్పీ
జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన నేరాలు బయటి ముఠా పనులుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరించామని, నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలపై నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచి దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రి పూట జాతీయ రహదారిపైనా పెట్రోలింగ్ పెంచామని ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రోజుకు అరకోటి సొత్తు దొంగలపాలు! - మీరు ఆదమరిచారో వాళ్లు కాజేస్తారు