Narsingi Drug Case Remand Report : నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలను పొందుపర్చారు. మూడ్రోజుల క్రితం అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ ముఠాసభ్యులను పట్టుకున్న పోలీసులు, ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. వీరినుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన పెడ్లర్లు, వినియోగాదారులు సహా 20 మందిని నిందితులుగా చేర్చారు.
ఈ మత్తుదందాలో నైజీరియన్‌కు చెందిన ఎబుకా సుజీ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆనౌహా బ్లెస్సింగ్ అనే నైజీరియన్ మహిళ ద్వారా అక్కడ్నుంచి దిల్లీ, హైదరాబాద్, ఏపీ సహా ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. డ్రగ్స్ సరఫరాలో ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్ గౌతం ఉండగా, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వరుణ్, గౌతం, షరీఫ్‌ల ద్వారా డ్రగ్స్ సరఫరా అయ్యాయని తెలిపారు.
ఈ కేసులో 20 మందిని నిందితులుగా చేర్చగా వారిలో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది వినియోగదారులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో ఏ10గా ప్రముఖ నటి సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. వరుణ్ అనే పెడ్లర్ ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేశాడని, అమన్ ప్రీత్‌కు మత్తు పదార్థాలు ఇచ్చింది కూడా వరుణేనని రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపర్చారు.
గౌతమ్ అనే పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాలకు మత్తు పదార్థాలు చేరుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడు గౌతమ్‌కు 9 నెలల్లో 10 లక్షల రూపాయలను బండ్లగూడలోని లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా నైజీరియన్లు చెల్లించినట్లు చెప్పారు. అయితే, పెడ్లర్లకు కావాల్సిన డబ్బును సమకూరుస్తూ నైజీరియన్లు ఆర్థికంగా ఆదుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
నిందితురాలు ఆనౌహ బ్లెస్సింగ్ తన స్నేహితురాలి పేరును తన పేరుగా మార్చుకుందని, ఇక్కడ పోలీసులకు చిక్కినా నేరచరిత్ర లేకుండా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు మరో పేరుతో పాస్‌పోర్టు తీసుకున్నట్లు వివరించారు. నైజీరియాలో తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యల వల్ల భారత్‌కు వచ్చిన ఆనౌహా బ్లెస్సింగ్, ఈ డ్రగ్స్ దందాలో దిగినట్లు పోలీసులు నివేదించారు.