Telegram SIM Card Fraud Gang Busted : మీకు సిమ్ కార్డులు కావాలా? బ్యాంకు ఖాతాలు కావాలా? ఏది కావాలన్నా సరే టెలిగ్రామ్‌లో ఇట్టే దొరుకుతుంది. వేల కోట్ల సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు దీన్నే అస్త్రంగా వాడుకుంటూ, సొమ్ము కాజేస్తున్నారు. ఇటీవల నమోదైన కేసుల్లో 80 శాతం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన మోసాలే ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై గతంలో పోలీసులు యాజమాన్యానికి ఎన్ని లేఖలు రాసినా ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా టెలిగ్రామ్‌లో సిమ్ కార్డు, బ్యాంకు ఖాతాల విక్రయాలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
టెలిగ్రామ్ ద్వారా ఎన్నో రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి. పెట్టుబడుల పేరుతో, ట్రేడింగ్ పేరుతో ఇలా రకరకాల పేర్లతో నేరాలు జరగుతున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న హైదరాబాద్ జీడిమెట్ల జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుబానీ, చింతల్ నివాసి నవీన్, ప్రేమ్ కుమార్‌లను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు, వారి నుంచి 113 సిమ్ కార్డులు, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు హైదరాబాద్‌కు చెందిన విజయ్, పదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ సైబర్ నేరాలు చేసేందుకు చైనా దేశస్థులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌లో చేరాడు.
అలర్ట్ - కొత్త సిమ్ కార్డు కొనాలా? ఈ రూల్స్ తెలియకపోతే అంతే!
చైనా దేశస్థులు ఎక్కువ ధరకు సిమ్ కార్డులు కొనడాన్ని గుర్తించి, తక్కువ ధరకు సిమ్ కార్డు టెలిగ్రామ్ యాప్‌లో అమ్ముతున్నట్లు విజయ్ తెలుసుకున్నాడు. అలా తక్కువ ధరకు సిమ్‌లు తీసుకువచ్చి వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైం పీఎస్ హెడ్ క్వార్టర్స్ ఇన్స్పెక్టర్ మహేందర్ దర్యాప్తు ప్రారంభించారు. ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ సిమ్ కార్డ్స్ సేల్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు.
విజయ్ అందుబాటులోకి రాగా, అతనితో చాట్ చేసి డీల్ కుదర్చుకున్నారు. 2 వేల సిమ్ కార్డులు కావాలని చెప్పారు. స్పందించిన నేరగాళ్లు, తొలుత 200 సిమ్ కార్డులు మాత్రమే ఇస్తామని, అంతా బాగా ఉంటే డీల్స్ చేద్దామని నిందితులు చెప్పారు. సిమ్ కార్డులు తీసుకునేందుకు కూకట్‌పల్లిలో ఓ ప్రాంతానికి రమ్మని తెలిపారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడికి వెళ్లిన పోలీసులు, ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారు చెప్పిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
టెలిగ్రామ్ యాప్ ద్వారా తొలుత సిమ్ కార్డులు కావాలని విజయ్‌కి సమాచారం వస్తుంది. డీల్ కుదిరిన తర్వాత ఈ విషయాన్ని విజయ్ అతని సోదరుడు అనిల్‌కు చెబుతాడు. సబ్ ఏజెంట్లైన సుబానీ, నవీన్, ప్రేమ్‌కుమార్ ద్వారా విజయ్ సిమ్ కార్డులను డెలివరీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు కాల్ సెంటర్లు అడిగినప్పుడల్లా విజయ్ సోదరుడు వాటిని దుబాయ్‌కి ట్యాబ్‌లెట్ల రూపంలో కొరియర్ చేస్తున్నాడు. అయితే విజయ్ ద్వారా చైనీయులు సేకరించిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు దుబాయ్, థాయ్‌లాండ్‌తో పాటు కాంబోడియాలో ఉన్న కాల్ సెంటర్లకు కూడా వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. - కె.వి.ఎం.ప్రసాద్, డీఎస్పీ, సీసీపీఎస్ హెడ్ క్వార్టర్స్
జులై 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్- ఇక నుంచి ఆ పప్పులు ఉడకవు!