Hyderabad Metro Open Loop ticketing System : హైదరాబాద్ మెట్రోలో మరింత అధునాతన టికెటింగ్ విధానం రాబోతోందా? అంటే అవుననే అంటోంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ. విదేశాల్లో మాదిరిగానే 'ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ'(ఓటీఎస్)ను తీసుకురాబోతోంది. ఈ విధానంలో ముందే టికెట్ తీసుకోవాల్సిన పనిలేదు దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ వసూలు చేస్తారు. కొత్త విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనే ప్రణాళికలో హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఉంది. అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.
ప్రస్తుతమున్న టికెటింగ్ విధానం ఇలా : ప్రజారవాణాలో టికెట్లు, వాటికి చెల్లింపు పద్ధతులపై ఈ మధ్య కాలంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కౌంటర్లలో సిబ్బంది విక్రయించే టికెట్లు, టికెట్ వెండింగ్ యంత్రాల ద్వారా పొందే విధానం, స్మార్ట్‌కార్డ్స్, మొబైల్ నుంచి వాట్సాప్‌లో టికెట్ పొందే వీలు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల వ్యవస్థల ద్వారా వాటిని అనుమతించడం వరకు హైదరాబాద్ మెట్రోలో ఇప్పటివరకు చూసినవే.
Drawbacks In Old Ticketing System : ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానంలో ముందే టికెట్ తీసుకోవాలి. దిల్‌సుఖ్‌నగర్‌లో మెట్రో ఎక్కి ఖైరతాబాద్ వరకు టికెట్ తీసుకుని మనసు మార్చుకుని అమీర్‌పేటలో దిగుతామంటే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల వ్యవస్థ అందుకు అనుమతించదు. స్టేషన్ సిబ్బందికి చెబితే అదనంగా ప్రయాణించిన దూరానికి డబ్బులు తీసుకున్న తర్వాత మాత్రమే బయటికి పంపిస్తారు. గమ్యస్థానానికి ముందే దిగుదామన్నా గేటు తెర్చుకోదు. అందుకోసం స్టేషన్ సిబ్బందిని సంప్రదించాల్సిందే. ఓటీఎస్‌తో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణించిన తర్వాత మాత్రమే దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు.
అసలేంటీ ఓపెన్ లూప్ టికెటింగ్ విధానం : కొత్తగా ఇప్పుడు ప్రజారవాణా వ్యవస్థలో ఈ ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగిస్తున్నారు. దీన్నే ఇక్కడా ప్రవేశపెట్టబోతున్నారు మెట్రో అధికారులు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు(ఎన్‌సీఎంసీ) ద్వారా దీన్ని అమలు చేయాలనేది ప్లాన్. ఇప్పటికే మెట్రోస్టేషన్లలో ఎన్‌సీఎంసీకి సంబంధించిన టికెట్ వ్యవస్థలను అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేశారు.
అన్నింటికీ ఒకటే కార్డు : ఈ విధానం అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింటికీ ఒకటే కార్డుతో చెల్లించవచ్చు. మన దేశంలో హరియాణా బస్సుల్లో 2022లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ప్రయాణీకుడు బస్సు ఎక్కేటప్పుడు కార్డును యంత్రం వద్ద చూపించాలి. మళ్లీ దిగేటప్పుడు చూపిస్తే జీపీఎస్ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీని తీసుకుంటుంది.
విదేశాల్లో ఎప్పటినుంచో వినియోగంలో : విదేశాల్లో ఎప్పటినుంచో విదేశాల్లో ఈ విధానం ఎప్పటి నుంచో వినియోగంలో ఉంది. ఓపెన్ లూప్ చెల్లింపుల పద్ధతిని ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ 2012లోనే ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతమవ్వడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజారవాణా వ్యవస్థల్లో అమలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లిన మనవాళ్లకు ఈ విధానం గురించి తెలిసే ఉంటుంది. త్వరలో హైదరాబాద్‌లో మన మెట్రోరైల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ లూప్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కంపెనీ కృషి చేస్తున్నట్లు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ తమ ఆర్థిక నివేదికలో వెల్లడించింది.
మెట్రో రెండో దశ కొత్త మార్గాలపై అధికారుల మేధోమథనం - చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ జంక్షన్!
మెట్రో ప్రయాణికులకు శుభవార్త - మరో ఆరు నెలలపాటు కొనసాగనున్న రాయితీలు - Hyderabad Metro Offer