Anika World Book Record Story : హైదరాబాద్ లింగంపల్లికి చెందిన కాల్వ ప్రీతం సాయి శిరీష దంపతుల కుమార్తె అనిక. పట్టుమని ఐదేళ్లు కూడా నిండని ఈ చిన్నారి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. వంద విభాగాలకు చెందిన ప్రముఖుల పేర్లు, వారు ఎందులో ప్రావీణ్యం సంపాదించారో వివరిస్తుంది. ఇందుకు గానూ మొదటిసారి తెలుగు బుక్ రికార్డును సొంతం చేసుకుంది. మూడేళ్ల వయస్సులోనే తల్లి ప్రోత్సాహంతో 3 నిమిషాల 23 సెకన్లలో హనుమాన్ చాలీసా పఠించి అబ్బుర పరిచి వరల్డ్ బుక్ రికార్డు సాధించింది చిన్నారి అనిక.
ప్రపంచ రికార్డు టైటిల్ సొంతం : చిన్నారి అనిక 50 దేశాలకు చెందిన ప్రసిద్ద పర్యాటక ప్రాంతాలను అలవోకగా చెప్పేస్తోంది. ఇందుకుగానూ హర్వార్డ్ వరల్డ్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. వంద దేశాల జాతీయ జెండాలను గుర్తించడంతో పాటు వాటి పేర్లను అవలీలగా చెప్పి, ఇండియా బుక్ రికార్డును కైవసం చేసుకుంది. ప్రపంచ దేశాల్లో ఉన్న స్మారక చిహ్నాల పేర్లను చెప్పేస్తోంది. ప్రపంచ పటంలో ఆసియా, ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల ప్రాంతాలను గుర్తించి అబ్బురపరచడంతో మిరాకిల్ ప్రపంచ రికార్డు టైటిల్‌ను సాధించింది.
'నేను యూకేజీ చదువుతున్నాను. నాకు ఆరు అవార్డులు వచ్చాయి. మొదటి అవార్డు హనుమాన్ చాలీసా తక్కువ సమయంలో పాడినందుకు వచ్చింది' -అనిక, రికార్డులు సాధించిన చిన్నారి
గ్రాండ్ మాస్టర్ టైటిల్‌తోపాటు ఆసియా బుక్ రికార్డు : మూడు నిమిషాల 43 సెకన్లలో ప్రపంచ పటంలోని ఏడు ఖండాల్లోని ప్రాంతాలను సులువుగా గుర్తు పట్టేసింది. దీంతో గ్రాండ్ మాస్టర్ టైటిల్‌తో పాటు ఆసియా బుక్ రికార్డుతో యాజమాన్యం సత్కరించింది. ఆసియా ఖండం, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల పటాలను చిత్రీకరిస్తోంది. పాప మేధాశక్తికి మెచ్చి లండన్ దేశీయులు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుతో సన్మానించారు. ఎల్‌కేజీ చదువుతున్న సమయంలోనే చిన్నారి మేధాశక్తిని గుర్తించిన తల్లిదండ్రులు, కరోనా సమయంలో వివిధ రంగాలకు చెందిన పరిజ్ఞానం పెంచుతూ వచ్చామని చెబుతున్నారు.
చిన్నారి భవిష్యత్తులో మరిన్ని అరుదైన రికార్డులు సొంతం చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నామని అనిక తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారి అనిక పరిజ్ఞానం, మేధాశక్తిని చూసి పలువురు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సాధించాలని ఆశీర్వదిస్తున్నారు.
'కరోనా సమయంలో చిన్నారికి ఏమైనా నేర్పించాలని మొదట హనుమాన్ చాలీసాతో స్టార్ట్ చేశాం. చాలా తొందరగా నేర్చుకుంది. దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లను సంప్రదించగా, పాపకు అవార్డు ఇచ్చారు. పాపకు రెండేళ్లు ఉన్నప్పటి నుంచి హనుమాన్ చాలీసా, శ్లోకాలు నేర్పించాం.' - అనిక, తల్లిదండ్రులు