Hyderabad CP on Amit Shah video case : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేళ అమిత్‌షా మార్ఫింగ్ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు, అమిత్‌షా వీడియోను మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసు వివరాలను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు. బీజేపీ నేత ప్రేమందర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్స్, లాప్‌టాప్స్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మార్ఫింగ్ చేసిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారని, దీంతో ఆ సంస్ధకు లేఖ రాసి పూర్తి వివరాలను సేకరించామని సీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులకు షరతులతో కూడిన బెయిల్ వచ్చిందని వెల్లడించారు. ఇదే అంశంపై దిల్లీ పోలీసులు సైతం కేసు నమోదు చేశారని, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను వారు సేకరించారని తెలిపారు.
అసలేం జరిగిందంటే.. ఈనెల 23వ తేదీన తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఆ హక్కులను తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేస్తామని అన్నారు. కానీ కొంత మంది ఆ మాటలను వక్రీకరించి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెబుతున్నట్లు ఎడిట్ చేశారని కేంద్ర హోంశాఖ, బీజేపీ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సహా మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు.
'అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశాము. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశాము. మార్ఫింగ్ చేసిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కోన్నారు. దీంతో ఆ సంస్ధకు లేఖ రాసి పూర్తి వివరాలను సేకరించాము. అరెస్ట్ చేసిన నిందితులకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది.' - కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు - మరోసారి గాంధీభవన్‌కు దిల్లీ పోలీసులు - Amit Shah Fake Video Case