Passenger Lament MMTS Train Delays In Hyderabad : సాధారణ మధ్య తరగతి ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌లో రెండో దశ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్-ఎంఎంటీఎస్సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించేలా చవకైన ప్రయాణాన్ని ఎంఎంటీఎస్ కల్పిస్తోంది. హైదరాబాద్‌లో చాలామంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసుల్లో అన్ని వర్గాల వారు ప్రయాణిస్తుంటారు.
రెండో దశ ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్‌లో భాగంగా సనత్ నగర్ నుంచి మౌలాలి మధ్య డబ్లింగ్‌తో పాటు, విద్యుద్దీకరణ పూర్తిచేసి ఇటీవలే ప్రారంభించారు. 2012-13లో రూ.816 కోట్లతో ఈ ప్రాజెక్టు మంజూరైంది. ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.1,150 కోట్లకు పెరిగిపోయింది. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకువచ్చారు. తమ ప్రాంతానికి ఎంఎంటీఎస్ సర్వీసులు రావడంతో. ఆయా ప్రాంతాల ప్రయాణికులు సంతోషించారు. ఎక్కువ మంది ఈ సర్వీసుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గుచూపారు.
MMTS: 2024 జనవరి నాటికి అందుబాటులోకి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు
స్టేషన్‌కి వస్తే కానీ తెలియని పరిస్థితి : ప్రారంభంలో రెండో దశ రూట్‌లో ఎంఎంటీఎస్ సర్వీసులను బాగానే తిప్పినప్పటికీ రానురాను సమయ పాలన పాటించడంలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్టేషన్‌కు వచ్చిన తర్వాత కానీ రైలు ఉందో లేదో తెలియని పరిస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు. ఎక్కువ శాతం ప్రయాణంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎంఎంటీఎస్‌కు ప్రత్యేక లైన్ లేకపోవడంతో ఏదైనా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చినా సర్వీసులు కాసేపు ఆపేస్తారని దీంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నామని మండిపడుతున్నారు.
"ప్రయాణికులు ఉన్నా రైళ్లను సమయానికి నడపడం లేదు. సమయపాలన లేకుండా రైళ్లను నడుపుతున్నారు. మేము రోజూ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రయాణిస్తుటాం. అసలు ఏరోజు టైమ్‌కు రైలు రాదు. గంటన్నర, రెండుగంటలు రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులు ఎవరు ఎక్కుతారు. ఒకవేళ రైలు ఎక్కినా మయానికి గమ్యానికి చేరుకోలేకపోతున్నాం. ప్రభుత్వం దీన్ని పట్టించుకుని సమయానికి రైళ్లను నడపాలి." - శ్రీనివాస్, సీపీఎం నగర కార్యదర్శి
సమయానికి సర్వీసులు రాకపోవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకో సమయానికి ఎంఎంటీఎస్ సర్వీసులు వస్తున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ సమయపాలనపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.