Young Woman Got Rs.34 Lakhs Package Per Year : ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, లక్ష్యం ఎంచుకుని కఠోర సాధన చేసింది ఈ అమ్మాయి. ఇంజినీరింగ్ పూర్తి చేయకముందే ఉద్యోగం సాధించాలని, ప్రణాళిక వేసుకుంది. ఏఐ, కోడింగ్, డేటా సైన్స్ అంశాలపై ఆసక్తితో ఇంటర్న్‌షిప్ చేసింది. ఎంచుకున్న కోర్సులోనూ సత్తాచాటింది. ఫలితంగా ఆశించినట్లే ఓ బహుళజాతి కంపెనీలో భారీ ప్యాకేజీని సొంతం చేసుకుంది.
ఈ అమ్మాయి పేరు యాళ్ల కృష్ణవేణి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ స్వస్థలం. యాళ్ల సదిరెడ్డి అంజలి దంపతుల పెద్ద అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం. సదిరెడ్డి ఓ ప్రైవేటు చిట్ ఫండ్‌లో చిరుద్యోగి. తల్లి అంజలి గృహిణీ. కృష్ణవేణి చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణించి పది, ఇంటర్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అలా ఇటీవల బీటెక్ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ రంగంపై దృష్టి సారించింది ఈ అమ్మాయి.
కోడింగ్, డేటా సైన్స్‌పై ప్రత్యేక దృష్టి : కరోనా మహమ్మారి కారణంగా ఎంసెట్ కోచింగ్‌లో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా 17వేల ర్యాంకును సాధించింది కృష్ణేవేణి. హన్మకొండ జిల్లా అనంతసాగర్‌లోని ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్సీ విభాగంలో చేరింది. ఇంజనీరింగ్ పూర్తికాకముందే ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది. కోడింగ్, డేటా సైన్స్‌పై దృష్టి పెట్టింది.
ఎంచుకున్న లక్ష్యం కోసం ఇంజినీరింగ్ మెుదటి సంవత్సరం నుంచే అవగాహన పెంచుకుంది కృష్ణవేణి. అధ్యాపకుల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంది. చదువుల్లో చక్కటి ప్రతిభ కనబర్చింది. తృతీయ సంవత్సరం చదువుతుండగా, పేపాల్ కంపెనీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు చేపట్టింది. అక్కడ తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది మంచి అవకాశం అందుకుంది కృష్ణవేణి.
"నేను ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు చాట్ జీపీటీని ఎక్కువగా వాడేవాళ్లం. అప్పుడు ఆ ఏఐకు సంబంధించి ఇంటర్నల్ వర్కింగ్‌పై నాకు చాలా మక్కువ ఏర్పడింది. అప్పుడే అనుకున్న సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్లాలని, అక్కడ నుంచే డాటా సైన్స్‌పై సైతం ఫోకస్ పెట్టాలనుకున్నప్పుడు చాట్ జీపీటీ నాకు ఆదర్శంగా నిలిచింది. దానిలా ఒక మోడల్‌ను అభివృద్ధి చేయాలనుకున్నాను." -కృష్ణవేణి, విద్యార్థిని
AI, Data Science, Mission Learning : చదువుతూనే ఉద్యోగ చేసే అవకాశం రావడంతో 3 నెలలు హైదరాబాద్‌లోని పేపాల్ ఆఫీస్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. చక్కటి పనితనాన్ని కనబర్చటంతో పూర్తి స్థాయి ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది పేపాల్ సంస్థ. చెల్లింపుల గేట్‌వేలకు సంబంధించిన టెక్నికల్ విభాగంలో ఉద్యోగానికి ఎంపిక చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏడాదికి రూ.34.40 లక్షల వేతనం ఇస్తామని అందులో పేర్కొందని కృష్ణేవేణి చెబుతోంది.
మంచివేతనంతో కూడిన ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం పాఠశాల రోజుల నుంచి ఉందని అంటోంది కృష్ణవేణి. కళాశాల చరిత్రలోనే ఇంత మొత్తంలో వేతనం రావడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది. కోడింగ్ డేటా సైన్స్‌పై దృష్టి పెట్టా, అదే నాకు మంచి అవకాశం కల్పించింది. ఏ కోర్సు చదివినా అందులో రాణించాలనే లక్ష్యం పెట్టుకోవాలి. అప్పుడే అనుకున్నది సాధించ వచ్చని, తన అనుభవాలను వివరిస్తుంది.
భవిష్యత్తులో స్టార్టప్ ఏర్పాటు చేసి, ఉపాధి కల్పిస్తా : ఇద్దరు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించాలనేది తల్లిదండ్రుల ఆశయం. అనుకున్న విధంగా ఇద్దరు అమ్మాయిలు చక్కగా చదివారు. పెద్ద కుమార్తె సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెళ్లి, మంచి వేతనంతో కూడిన ఉద్యోగం రావటం చాలా ఆనందంగా ఉందంటోంది తల్లి అంజలి.
చాట్ జీటీపీని స్ఫూర్తిగా తీసుకుని ఓ మోడల్‌ను తీసుకువాలనే లక్ష్యం పెట్టుకుంది కృష్ణవేణి. అందుకోసమే ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అంశాలపై పట్టు సాధించుకున్నట్లు చెబుతోంది. భవిష్యత్తులో స్టార్టప్ ఏర్పాటు చేసి, ఉపాధి కల్పిస్తాని ధీమా వ్యక్తం చేస్తోందీ అమ్మాయి.
YUVA - వ్యాపారం చేయాలనుకునే ఔత్సాహికులకు ఎడ్వెంచర్ పార్క్ ప్రోత్సాహం - EdVenture park for Startups