Dengue Alert in Telangana : రాష్ట్రంలో డెంగీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5 వేల 372 మంది దీని బారిన పడ్డారు. రెండు నెలలుగా 4 వేల 294 నమోదయ్యాయి. డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5 శాతం పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగీ నిర్ధారణ అవుతోంది.
మరింతగా పెరుగుదల : అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీగా కేసులు నమోదైనా డెంగీ మరణాలు లేవని వైద్యఆరోగ్యశాఖ చెబుతోంది. 152 మందికి చికెన్ గున్యా, 191 మందికి మలేరియా సోకినట్టు ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది.
నాలుగైదు రోజుల్లోనే విషమం : జులై నుంచి ఇప్పటి వరకు కోటి 42 లక్షల 78 వేల 723 నివాసాల్లో జ్వర సర్వే చేసినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. డెంగీ బాధిత చిన్నారులతో నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ సహా జిల్లాల్లోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. బాధితుల్లో ఏడాదిన్నర నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు ఉంటున్నారు. పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
చిన్నారులపై పంజా : డెంగీకి కారణమయ్యే టైగర్ దోమ మంచి నీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. పిల్లల్లో డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్ తదితర జ్వరాలు పెరుగుతున్నాయి. ఆఖరి నిమిషంలో వైద్యులను సంప్రదించడంతో కొన్నిసార్లు పరిస్థితి విషమంగా మారుతోంది.
జ్వరం వస్తే పారాసిటమాల్ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదని, రెండురోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్యారోగ్యశాఖ సూచిస్తోంది. వర్షం కారణంగా తాగునీరు, ఆహారం కలుషితమవడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బాగా కాచి చల్లార్చిన నీళ్లతోపాటు వేడి వేడిగా ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల నివారణకు పాఠశాలల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Viral Infection VS Dengue : డెంగ్యూ Vs వైరల్ ఇన్ఫెక్షన్.. లక్షణాలు ఒకేలా ఉంటాయా.. తేడా ఏంటీ..?
How to Prevent Dengue Fever Telugu : మీ ఇంట్లో 'డెంగీ' దోమలున్నాయా.. ఈ చిట్కాలతో అడ్డుకట్ట వేద్దాం