Huge Devotees Rush At Tirumala : తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీపావళి పర్వదినం సెలవులకు వారంతపు సెలవులు కలిసి రావడంతో శ్రీవారిని దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమల గిరులకు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తులు తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్ని పూర్తిగా నిండి వెలుపలకు వచ్చిన క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు : భక్తుల రద్దీకి అనుగుణంగానే టీటీడీ దేవస్థానం అధికారులు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసారు. వెలుపల క్యూ లైన్లో ఉన్న భక్తులతో పాటు కంపార్ట్మెంట్ల షెడ్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరాయంగా మంచినీరుతో పాటు ఇతర పానీయాలను సరఫరా చేస్తున్నారు. రద్దీ కారణంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది వాహన రాకపోకలను, వాహనాల పార్కింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.
భక్తులతో నిండిపోయిన కంపార్ట్‌మెంట్‌లు : కాగా అంతకు ముందు నిన్న తిరుమలలో టోకెన్లు లేని సామాన్య భక్తులకు తిరుమలేశుని సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ క్యూలైన్ వరకు భక్తులు బారులు తీరిఉన్నారు. కాగా తిరుమల శ్రీవారిని 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,753 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించారు. తిరుమల ఆలయం హుండీ ఆదాయం రూ.2.38 కోట్లు వచ్చింది. ఆదివారం వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక - ఆర్జితసేవా టికెట్లు, రూ.300 టికెట్ల కోటా తేదీలు వచ్చేశాయ్
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్ - ఆ మార్గం మూసేశారు! - తెలియకపోతే ఫ్యామిలీకి తీవ్ర ఇబ్బందులు