RTO Office Check Post Corruption : రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ కార్యాలయాలు, చెక్‌పోస్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. అవినీతి నిరోధకశాఖ రాష్ట్రవ్యాప్తంగా నిన్న జరిపిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. కార్యాలయాల్లోనే పెద్దమొత్తంలో డబ్బులు దొరికాయి. అక్రమాల్ని అరికట్టాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు.
కోడ్ ఉంటే సరి లేదంటే తిరగాల్సిందే : ఫలితంగా ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలు కార్యాలయాల్లో అదనంగా ముట్టజెబితేగానీ పని జరగని పరిస్థితి. ఆఫీసుల్లోనే కొందరు ప్రైవేటు సిబ్బంది, దళారులు తిష్ఠవేస్తున్నారు. కొందరు అధికారులు ప్రైవేటుగా కొందరిని నియమించుకుని వాహనదారుల నుంచి వసూళ్లు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో చెక్‌పోస్టులో ఏడాదికి ఐదారు కోట్ల వరకు అవినీతి జరుగుతోందని ఓ అంచనా.
డ్రైవింగ్ శాశ్వత లైసెన్స్ కావాలంటే ద్విచక్రవాహనానికి ఓ ధర, కారుకు మరో రేటు వాహన శాశ్వత రిజిస్ట్రేషన్‌కు, బడి బస్సులు వంటి రవాణా వాహనాల ఫిట్‌నెస్ రెన్యువల్‌కు ఓ ధర, లెర్నర్ లైసెన్సుకు కంప్యూటర్ పరీక్షకు ఓ ధర వసూలు చేస్తున్నారు. వాహనదారులు నేరుగా వెళ్తే ఏవో సాకులతో మళ్లీ మళ్లీ తిప్పిస్తూ దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితుల్ని కొందరు అధికారులు కల్పిస్తున్నారు. దళారుల ద్వారా వెళ్లే దరఖాస్తులపై పెన్సిల్‌తో ఓ కోడ్ ఉంటుంది. అప్పుడు చకచకా పని అయిపోతుంది. లేదంటే ఏదో సాకుతో మళ్లీమళ్లీ రప్పించుకుంటారు.
అక్రమాలకు అడ్డాగా చెక్‌పోస్టులు : అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు అక్రమాలకు అడ్డాగా మారాయి. తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని అశ్వారావుపేట చెక్‌పోస్టులో భారీ అవినీతి జరుగుతోంది. ఇక్కడ ఏడాదికి ఏడు కోట్ల రూపాలయ అవినీతి జరుగుతోందని ఓ అంచనా. అన్ని దస్త్రాలు, అనుమతులు సక్రమంగానే ఉన్నాయంటూ నగదు ఇవ్వకుండా వెళ్తున్న లారీలను వెంబడించి కేసులు పెట్టి 10వేల నుంచి 15 వేల వరకు జరిమానా విధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బడి బస్సులు, లారీల వంటి భారీ వాహనాలకు ఫిట్‌నెస్ రెన్యువల్ దళారులు ద్వారా వస్తేనే అవుతున్నాయన్న విమర్శలున్నాయి.
కామారెడ్డి జిల్లాలోని ఓ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో కొద్దికాలం క్రితం వరకు ఏకంగా 21 మంది రవాణా అధికారులు డిప్యుటేషన్‌పై కొనసాగారు. భారీ పైరవీలతో చాలాకాలంపాటు తిష్ఠవేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. ఇక్కడ ఉన్న అధికారులు 20 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించుకున్నారు. రోజకు రూ. 10-15 లక్షల వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే జిల్లా మద్నూరు మండలంలోని సలాబత్‌పూర్ తనిఖీ కేంద్రంలో నలుగురు ప్రైవేటు వ్యక్తులు తిష్ఠవేశారు. నిత్యం ఐదారు లక్షలపైనే వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
Telangana Transport Department Revenue Increased : రాష్ట్ర రవాణా శాఖలో కాసుల వర్షం
పెండింగ్ చలాన్ల చెల్లింపులకు విశేష స్పందన - హ్యాంగైన సర్వర్