How To Make Dussehra Holidays Useful : సమయం విలువ వెలకట్టలేనిది. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ప్రతిక్షణం ఉన్నతులుగా దోహదం చేస్తుంది. దసరా సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు ఈ నెల 14 వరకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెలవులను ఏ విధంగా వినోదం, విజ్ఞానమయంగా మార్చవచ్చనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
సెల్‌ఫోన్‌కు దూరం : పాఠశాలలు, కళాశాలలు కొనసాగినన్ని రోజులు విద్యార్థులు ఉదయం నుంచి రాత్రి వరకు చదువు, హోమ్ వర్క్ సన్నద్ధతతో బిజీబిజీగా గడిపారు. కాస్త సమయం దొరికినా స్మార్ట్‌ఫోన్ చూసేవారు. ప్రస్తుత సెలవు రోజుల్లో సెల్‌ఫోన్‌కు అపరిమితంగా అవకాశం ఇవ్వొద్దు. ఫలితంగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. గంటలకొద్దీ ఫోన్‌లో గడిపే పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చరవాణికి అలవాటు పడితే సెలవుల తర్వాత పాఠశాలల సమయాల్లోనూ మనసు చదువుపై నిమగ్నం చేయలేరు.
పెద్దలను గౌరవించడం నేర్పుదాం : సెలవుల్లో పిల్లలకు కుటుంబ సభ్యులు తమ నేపథ్యాన్ని చెప్పాలి. ఎంత కష్టపడితే ఈ స్థాయికి చేరామనే విషయాన్ని ఆసక్తికరంగా వివరించాలి. పరస్పరం గౌరవించే మంచి విధానాన్ని అలవర్చాలి. సెలవు రోజుల్లో పిల్లలను బంధువుల ఇళ్లకు పంపిస్తుంటారు. పెద్దలను గౌరవించడం నేర్పిస్తే మంచిది. ఇందుకోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరముంది. వారితో కలిసి భోజనం చేయడం, సరదాగా స్నేహపూర్వక వాతావరణంలో మెలుగుతూ ఉండటమనేది ముఖ్యం.
ప్రోత్సాహంతో ఉత్సాహం : పిల్లలకు ఆసక్తి ఉన్న ఆట పాటలతో పాటు నచ్చిన కళలవైపు మోటివేట్ చేసేందుకు సెలవుల సమయాన్ని మంచి అవకాశంగా భావించాలి. చిత్రలేఖనం, శాస్త్రీయ, జానపద నృత్యం, సంగీతం, వాద్యం ఇతర అంశాలనే నేర్చుకునే దిశగా ప్రేరేపించి, ఫలితంగా వాటిపై పట్టు సాధించేలా చేయవచ్చు.
సంస్కృతి నేర్పిస్తే : ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల ప్రభావం ఎంతో ఉండేది. చిన్నా.. పెద్దా అంతా కలిసి ఉండేవారు. సెలవుల్లో అమ్మమ, నాయనమ్మ, బంధువుల ఇళ్లకు వెళ్లడం పరిపాటి. ఇదే అదనుగా సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే వేదికగా మార్చుకోవాలి. పండుగల విశిష్టతను తెలియజేయాలి.
పుస్తకం వైపు మరలేలా : మారుతున్న పరిస్థితుల్లో పిల్లలు పుస్తక పఠనానికి దూరమవుతున్నారు. అత్యధికులు ఆన్‌లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. గ్రంథాలయాల్లో పుస్తక పఠనం ద్వారా ఎనలేని విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఇక్కడ చదివిన ఎంతో మంది గొప్ప వ్యక్తులుగా ఎదిగారు. సెలవుల నేపథ్యంలో ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం పిల్లలను ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న విజ్ఞాన భాండాగారాలకు తీసుకెళ్లాలి. పుస్తకాలు, నిఘంటువులు, పత్రికలు అక్కడ అందుబాటులో ఉంటాయనే విషయాన్ని తెలియజెప్పాలి. తద్వారా వారిలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది.