How to Know Your Nearest Aadhaar Center : ఆధార్ కార్డు అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాస్పిటల్, బ్యాంకులు, కాలేజీలు, రేషన్ షాపులు, బ్యాంకు అకౌంట్.. ఇలా ప్రతిదానికీ ఆధార్ ఉండాల్సిందే. అంతేనా..? ప్రభుత్వ రాయితీలతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. ముఖ్యంగా అధికారిక గుర్తింపు కార్డుగా దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు.
అయితే.. అంతటి కీలకమైన ధ్రువీకరణ పత్రంలో తప్పులు ఉన్నవారు ఎంతో మంది. వాటిని సరిచేయించుకోవాలంటే కచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సిందే. కానీ.. నగరాల్లో ఉన్నవారికి ఆధార్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆధార్ కేంద్రాన్ని వెతకడం అంటే ఓ సవాలే. అయితే, మీరు ఇకపై ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు. క్షణాల్లో మీ దగ్గరలోని ఆధార్ సెంటర్‌ను తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గరలోని ఆధార్ కేంద్రం ఎలా తెలుసుకోవాలంటే?
- ఇందుకోసం ముందుగా మీరు ఫోన్లో https://ts.meeseva.telangana.gov.in/tbocwwb/AasharlocationFont.htmని సందర్శించాలి.
- అప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ముందుగా మీ జిల్లాను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీ మండల కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
- అంతే.. మీకు దగ్గరలోని ఆధార్ కేంద్రాలు డిస్ప్లే మీద కనిపిస్తాయి.
- అందులో.. ఆధార్ కేంద్రాల అడ్రస్, అపరేటర్ నేమ్, ఫోన్ నంబర్, సెంటర్ టైప్ వంటి వివరాలు స్పష్టంగా ఉంటాయి.
- అప్పుడు వాటి ఆధారంగా మీ దగ్గరలోని ఆధార్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు అందులో పేర్కొన్న అడ్రస్ తెలియకపోయినా.. ఫోన్ నంబర్‌కి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని ఆధార్ కేంద్రాన్ని రీచ్ అవ్వొచ్చు.
ఆధార్ ఉచిత అప్డేట్కు చివరి తేదీ ఇదే :
ఆధార్ వివరాలను పదేళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) మరోసారి పొడిగించింది. 2024 డిసెంబర్ 14వ తేదీ వరకు ఆధార్ ఫ్రీ అప్డేట్కి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇప్పటి వరకూ అప్డేట్ చేసులేకపోయిన వారంతా ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని సూచించింది. అంతేకాదు.. ఆధార్ కార్డులో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన వారూ వాటిని సవరించుకోవచ్చు. అయితే.. ఏ మార్పు చేసుకోవాలని అనుకుంటున్నారో.. అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి :
మీ ఇంట్లో అద్దెకుండేవారి ఆధార్ అడిగారా? ఒరిజినలో కాదో ఎలా చెక్ చేయాలో తెలుసా?
మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ మరిచిపోయారా? సింపుల్‌గా తెలుసుకోండిలా!